
రాష్ట్రంలో వికృత పాలన
టెక్కలి: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో వికృత పాలన కొనసాగుతోందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారని న్యాయవాది, వైఎస్సార్‌సీపీ నాయకుడు సింగుపురం మోహన్‌రావు మండిపడ్డారు. టెక్కలిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో ‘సాక్షి’ పత్రికపై విషం కక్కే విధంగా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. డీఎస్పీ, ఏఎస్పీ పదోన్నతుల్లో సీనియర్ పోలీస్ అధికారులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపిన ‘సాక్షి’పై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిలోకి అక్రమంగా చొరబడి భయాందోళన కలిగించే విధంగా ప్రవర్తించారని గుర్తు చేశారు. తాజాగా మరోసారి సాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసు నమోదు చేశారని తెలిపారు. పత్రికల భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా దుందుడుకు చర్యలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు, హైకోర్టులు హెచ్చరిస్తున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు తెగబడుతోందని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు న్యాయ స్థానాల మార్గదర్శకాలను పరిహాసం చేయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.