
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
ఆమదాలవలస మండలం కొత్తవలస, పాత నిమ్మతొర్లువాడ గ్రామాల మధ్య ఇసుక ర్యాంపును పరిశీలించి విచారిస్తున్న ఆర్డీవో సాయిప్రత్యూష
ఆమదాలవలస: మండలంలోని నాగావళి నది పరివాహక ప్రాంతమైన కొత్తవలస, పాత నిమ్మతొర్లు వాడ వద్ద నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపు తవ్వకాలు నిబంధనల మేరకు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష ర్యాంపు నిర్వాహకులకు హెచ్చరించారు. ఆదివారం అర్ధరాత్రి ఇసుక ర్యాంపు నిర్వాహకులకు గ్రామస్తుల మధ్య జరిగిన వివాదంపై ఆమె సోమవారం విచారణ చేపట్టారు. తొలుత ఇసుక ర్యాంపును పరిశీలించి అనంతరం పాతనిమ్మతొర్లువాడ గ్రామస్తులతో పోలీసులు సమక్షంలో మాట్లాడారు. ముందుగా గ్రామస్తులను ఆర్డీవో విచారించగా నాగావళి పరివాహక ప్రాంతంలో శ్మశాన వాటికతో పాటు యువకులు ఆటలాడే ప్రదేశం ఉందని, ర్యాంపు నిర్వాహకులు ఇక్కడ వాహనాలు తీసుకెళ్తుండడం వల్ల మైదాన ప్రాంతం కోతకు గురవుతోందని తెలిపారు. అయినా ఆపకుండా తవ్వకాలు చేస్తుండడంతో జేసీబీల వద్ద తవ్వకాలు అడ్డుకున్నామని తెలిపారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆమదాలవలస ఎస్‌ఐ బాలరాజు, సిబ్బందితో వచ్చి మాట్లాడారని, కానీ తర్వాత ర్యాంపు నిర్వాహకులు కొందరు రౌడీలను తీసుకువచ్చి తమపై దాడి చేశారని వారు ఆర్డీవోకు తెలిపారు. దీనిపై ఆర్డీవో ర్యాంపు నిర్వాహకులను ప్రశ్నించగా స్థానికులు తవ్వకాలు వద్దు అంటే వాహనాలు నిలిపేసి వెళ్లిపోయామని, దాడులకు తమకు సంబంధం లేదని తెలిపారు. దీంతో గ్రామస్తులకు ర్యాంపు నిర్వాహకులకు వాగ్వాదం జరిగింది. ఇసుకర్యాంపు వద్ద ఉన్న సీపీ కెమెరాల్లో దాడుల దృశ్యాలు చూపించి దాడిచేసిన వారిని గుర్తించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కెమెరాలు పనిచేయడం లేదని ర్యాంపు నిర్వాహకులు చెప్పడంతో.. స్థానికంగా ఉన్న టీడీపీ నాయకుల అండదండలతో టీడీపీ గూండాలతోనే దాడి చేయించారని గ్రామస్తులు ఆరోపించారు. ఇదంతా విన్న ఆర్డీవో ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పొన్నాడ సుధాకర్ స్పందిస్తూ గ్రామస్తులు సూచించిన మూడు ప్రదేశాలను విడిచిపెట్టి ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక తవ్వకాలు చేపట్టాలని సూచించారు. ఇసుక లారీల రాకపోకలకు ఏర్పాటుచేసిన రహదారికి తక్షణమే అనుమతులు తీసుకోవాలని లేకుంటే చర్యలు తప్పవని ఆర్డీవో హెచ్చరించారు. విచారణలో ఆమదాలవలస తహసీల్దారు రాంబాబు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష