
‘టెక్కలిలో కొత్త మద్యం డిపో ఎందుకు..?’
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి కొత్త డిపోను టెక్కలిలో ఎందుకు పెడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాసరావు, సీపీఐ (ఎంఎల్) జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ ప్రశ్నించారు. మూడు తరాలుగా డిపోలో పనిచేస్తున్న హమాలీల ఉపాధిని కాపాడాలన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఇందిరానగర్ కాలనీలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశంనిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో అచ్చెన్నాయుడిని కలిసి వినతిపత్రం ఇచ్చినప్పు డు టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటు చేయకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు మళ్లీ టెక్కలిలో ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. జిల్లా ప్రజలు శివారు భూములకు నీరు ఇవ్వమని అడుగుతున్నారే తప్ప కొత్తగా డిపోలు పెట్టి బీరు అడగడం లేదని ఎద్దేవా చేశారు. ఎచ్చెర్ల డిపోను యథావిధిగా కొనసాగించి హమాలీల ఉపాధిని కాపాడాలని డిమాండ్ చేశారు.