
● ఇదేనా సుపరిపాలన..?
ఆమదాలవలస: దాడులు చేయడమే కూటమి ప్రభుత్వం సుపరిపాలనా..? అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి కోట గోవిందరావు ప్రశ్నించారు. ఆమదాలవలస మండలంలోని పాతనిమ్మతొర్లువాడ గ్రామంలో ఆదివారం రాత్రి ఇసుకాసురులు ఆ గ్రామ ప్రజలపై చేసిన దాడిని ఖండిస్తూ సోమవారం ఇసుక ర్యాంపును సందర్శించారు. ఎస్‌ఐ ఎస్.బాలరాజుతో మాట్లాడారు. దాడిలో ప్రాణాలు కోల్పోతే ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. గ్రామస్తులకు అన్యాయం జరిగితే సహించేది లేదని అన్నారు. కూటమి నాయకులు అక్రమార్జన కోసం ఎగబడుతున్నారని, ప్రజలకు అందాల్సిన సంక్షేమానికి గండి కొడుతున్నారని అన్నారు. గాయపడిన వారికి అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో ఆయన తోపాటు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.