
‘పచ్చని ఉద్దానంలో కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణం సరికాదు
పలాస: పచ్చని ఉద్దానం ప్రాంతంలో కార్గో ఎయిర్‌పోర్టును నిర్మాణం చేయాలనుకోవడం సరికాదని, దీన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల ని రైతుకూలీ సంఘం రాష్ట్ర నాయకుడు కోనేరు రమేష్ చెప్పారు. బొడ్డపాడు గ్రామంలో ఆయన శనివారం మాట్లాడుతూ జీడి, కొబ్బరి తోటలను పెంచుతూ వేలాది మంది రైతులు బతుకుతున్నారని వాటిని నాశనం చేసి ఎయిర్‌పోర్టు నిర్మించడం పర్యావరణానికి మంచిది కాదన్నారు. గురుపూజోత్సవం నాడు రాష్ట్రంలో రెండు కోట్ల మొక్కలను నాటి రికార్డు సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహజ వనరులను కాపాడాలి గానీ ఈ విధంగా ఉద్దానంలో చెట్లను నరికి విధ్వంసం సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సబబన్నారు. తక్షణమే ఎయిర్‌పోర్టు నిర్మాణ ప్రతిపాదనను విరమించుకోవాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆయన హెచ్చరించారు.
ఎరువుల కోసం రైతుల నిరీక్షణ
సారవకోట: మండలంలోని చీడిపూడి రైతు సేవా కేంద్రంలో శనివారం ఎరువుల కోసం రైతులు నిరీక్షించారు. ఈ రైతు సేవా కేంద్రానికి ఎరువులు వచ్చాయని తెలుసుకున్న ఆ రైతు సేవా కేంద్రం పరిధిలో ఉన్న రైతులు చేరుకున్నారు. ఇక్కడున్న వీఏఏ ఆన్‌లైన్‌లో వాటిని నమోదు చేసి ఇచ్చేందుకు ఆలస్యం కావడంతో ఎరువుల కోసం చాలాసేపు నిరీక్షించాల్సి వచ్చింది. చాలామంది రైతులు నిరీక్షించలేక తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.
‘సమస్య పరిష్కరించే వరకు సమ్మె ఆగదు’
కాశీబుగ్గ: ప్రభుత్వం జోక్యం చేసుకొని తమ సమస్యలు పరిష్కారం చేసే దాకా సమ్మె ఆగద ని మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నెల 16 నుంచి తలపెట్టిన మున్సిపల్ కార్మికుల సమ్మె శనివారానికి నాల్గో రోజుకు చేరింది. ఈ సందర్బంగా కాశీబుగ్గ సంత మైదానంలో మోకాళ్లపై నిలుచుని నిరసన చేపట్టారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెయ్యిల గణపతిరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు చింతల మురగన్, కె.వెంకట్, ఎం.రవి, ఎస్.శంకర్ తదితరులు మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా శానిటేషన్ కార్మికులు, ఇదివరకు మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు ఆందోళన లు సమ్మెలు చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడం తగదని అన్నారు.

‘పచ్చని ఉద్దానంలో కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణం సరికాదు