పెత్తనం నేతలది.. | - | Sakshi
Sakshi News home page

పెత్తనం నేతలది..

Jul 20 2025 5:47 AM | Updated on Jul 20 2025 3:07 PM

పెత్త

పెత్తనం నేతలది..

సొత్తు ప్రజలది..
● రైతులకు తప్పని అవస్థలు ● ప్రభుత్వ ఎరువులు తమ ఆధీనంలో ఉండేలా టీడీపీ నాయకుల అరాచకం ● టీడీపీ సానుభూతి పరులకే అందేలా కుట్రలు ● ప్రభుత్వ కార్యాలయాల్లో కాకుండా తమ ఇళ్లల్లో, ఫామ్‌ హౌస్‌, ప్రైవేటు గోడౌన్‌లలో ఎరువులను దించుకుంటున్న దుస్థితి ● రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్‌ల కేంద్రాల్లో కూడా పచ్చనేతల హవా

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

ప్రజాధనంతో కొన్న ఎరువులవి.. జనాలకు పంచాల్సిన ఎరువులవి. కానీ వాటిపై టీడీపీ నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు. ఎరువుల పంపిణీలో టీడీపీ నాయకుల బరితెగింపు పతాక స్థాయికి చేరింది. రైతులకు వన్‌బీ ప్రకారంగా ఇవ్వాల్సిన ఎరువులను సైతం పక్కదారి పట్టిస్తున్నారు. తమ సొత్తు అన్నట్టుగా తమ ఇళ్లల్లో, తమకు చెందిన ప్రదేశాల్లో అన్‌లోడ్‌ చేసుకుని అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నాయకుడి ఫామ్‌హౌస్‌లో యూరియా పంపిణీ చేయడంపై దల్లిపేట, పుల్లాజీపేట గ్రామస్తులైతే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఆ ఫామ్‌ హౌస్‌కు వెళ్లి తీసుకోబోమని, సచివాలయంలో విక్రయిస్తేనే తీసుకుంటామని సుమారు 200 మంది రైతులు వన్‌బీలు పట్టుకుని నిరసన తెలియజేశారంటే పరిస్థితి ఏ స్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

బాబు పాలనలో తప్పని అవస్థలు

రైతు ఎంత సాగు చేస్తున్నారో? వారికెంత ఎరువులు అవసరమో? ఈ క్రాప్‌ ద్వారా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ముందే గుర్తించేవారు. ఆ మేరకు రైతులకు సరిపడా ఎరువులు నేరుగా ఇంటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేసేవారు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక ఈ క్రాప్‌ కార్యక్రమా న్ని పక్కన పెట్టేశారు. జిల్లాలో ఏ రైతులు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారో వంటి వివరాలు అధికారుల వద్ద అందుబాటులో లేవు. దీంతో టీడీపీ నాయకుల జోక్యం పెరిగి రైతులకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ముందు వరకు ఉన్న అవస్థలు తప్పడం లేదు. అసలే కొరత ఆపై అరకొర యూరియా వెరసీ ఎటూ సరిపోవడం లేదు. ఎక్కడ చూసినా భారీ క్యూలు తప్ప రైతులందరికీ యూరియా దొరకడం లేదు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉండేవో ఇప్పుడు అదే రకమైన పరిస్థితులు ఉన్నాయి. ఎరువుల కోసం క్యూలు, దొరక్క రైతులకు అవస్థలు, బ్లాక్‌ మార్కెట్‌ను ఆశ్రయిస్తున్న పరిస్థితులు, ప్రైవేటు వ్యాపారులు ఎంత చెబితే అంతకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి పునరావృతమైంది.

చెలరేగిపోతున్న టీడీపీ నాయకులు

ఇదే అవకాశంగా తీసుకుని టీడీపీ నాయకులు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వం ద్వారా అందించే ఎరువులపై పెత్తనం చెలాయిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల వద్ద దించాల్సిన ఎరువులను తమ ఇళ్ల వద్ద దించుకుంటున్నారు. కొన్ని చోట్ల తమ కనుసన్నల్లో నడిచే పీఎసీఎస్‌ల వద్ద దించుతున్నారు. ఇంకొందరు తమ ప్రైవేటు గోడౌన్‌లలో దించుతున్నారు. అధికారులు సైతం తలొగ్గడంతో తమ ఆధీనంలో దించుకున్న ఎరువులను తమకు కావాల్సిన వారికే విక్రయిస్తున్నారు. ఫలితంగా టీడీపీ సానుభూతి పరులకు ప్రభుత్వం సరఫరా చేసే ఎరువులు అందుతున్నాయి. మిగతా వారు ప్రైవేటు డీలర్లను ఆశ్రయించక తప్పడం లేదు. ఎక్కువ రేటుకు కొనుగోలు చేసుకోవల్సిన దుస్థితి నెలకొంది. పీఏసీఎస్‌లు పేరుకే ప్రభుత్వ సంస్థ అయినప్పటికీ అధికార పార్టీ నాయకుల పెత్తనం ఉండటంతో అక్కడ వారి మాటే పైచేయి అవుతుంది. వాళ్లు చెప్పిన వారికి ఎరువుల పంపిణీ చేస్తున్నారు. రైతు సేవా కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ కూడా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లలో వారిచ్చిన రైతుల సిఫార్సుల జాబితా మేరకే ప్రభుత్వం ద్వారా సరఫరా చేయాల్సిన ఎరువులను అందజేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

ఈ ఫొటో చూడండి? వచ్చిన యూరియాలో 80 బస్తాల వరకు పక్క దారి పట్టించారని, బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముకోవడానికి టీడీపీ నాయకులు కుట్ర పూరితంగా వ్యవహరించారని పొందూరు మండలం బాణం

గ్రామంలో యూరియా లారీకి అడ్డంగా రైతులు నిలబడి నిలదీసిన దృశ్యమిది.

గ్రామస్తులంతా ఎదురు తిరిగి ఆందోళన చేయడంతో పాటు వ్యవసాయ అధికారిని నిలదీయడంతో దారికొచ్చారు.

పెత్తనం నేతలది.. 1
1/1

పెత్తనం నేతలది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement