
వైఎస్సార్ జయంతి ఘనంగా నిర్వహించాలి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: గలగలా పారుతూ వంశధార ఆయనను గుర్తు చేస్తూ ఉంటుంది. వేలాదిమందిని రక్షిస్తూ రిమ్స్ ఆ పేరును తలచుకుంటూనే ఉంటుంది. కరకట్టల కింద ఉన్న ఊళ్లు ఆయన రూపాన్ని తలచుకుంటూనే ఉంటాయి. బీఆర్‌ఏయూ పరిసరాలు ఆయన వదిలిన గురుతులను గుర్తు చేస్తూనే ఉంటాయి. సిక్కోలులో అడుగడుగునా వైఎస్ రాజశేఖర రెడ్డి జ్ఞాపకాలు ఉన్నాయి. జిల్లాలో మొదలైన ప్రతి కీలక ప్రాజెక్టు ఆయన చలవే. సిక్కోలు నుదుటిపై ఉన్న వెనుకబడిన జిల్లా అన్న ముద్ర చెరపడానికి వైఎస్సార్ చేసిన యజ్ఞం ఓ మధుర జ్ఞాపకంగా సిక్కోలు గుండె గదిలో చిరస్మరణీయంగా ఉంటుంది. నేడు మహానేత వైఎస్సార్ జయంతి.
వైఎస్సార్ జ్ఞాపకాల్లో కొన్ని..
● చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకే విశాఖపట్నానికి పరుగులు తీసే శ్రీకాకుళం జిల్లా ప్రజలకు రిమ్స్‌ను కానుకగా ఇచ్చారు. 300 పడకల జిల్లా కేంద్ర ఆసుపత్రిని 500 పడకలుగా మార్చారు.
● ఎచ్చెర్లలో 2008 జూలై 25న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ ఏర్పాటు చేశారు.
● జిల్లాలో 2.50లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేశారు.
● 2005మే నెలలో వంశధార స్టేజ్ 2, ఫేజ్2 ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. 20 మండలాల్లో 2.55లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు తలపెట్టారు.
● జిల్లాలోని హిరమండలం వద్ద సుమారు 10వేల ఎకరాల్లో 19టీఎంసీల నీటి నిల్వకోసం రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు.
● తోటపల్లి ఫేజ్–2 పనుల ఘనత ఆయనకే దక్కుతుంది.
● సాగునీరు, పలాస పట్టణానికి తాగునీటి సమ స్య పరిష్కారం కోసం రూ.123.25 కోట్లతో ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
● వంశధార, నాగావళి నదుల అనుసంధానం పనులకు శ్రీకారం చుట్టారు.
● 12,500 ఎకరాలకు సాగునీటి కోసం మడ్డువలస ప్రాజెక్టు స్టేజ్–1 పనులను రూ.57.87 కోట్లతో చేపట్టారు.
● రూ. 300కోట్లతో కరకట్టల నిర్మాణాలకు సంకల్పించారు.
● సీతంపేట ఏజెన్సీలో 14వేల ఎకరాల్లో 5వేల మంది గిరిజన రైతులకు పట్టాలు ఇచ్చారు.
● పేదలకు స్థలమిచ్చి గూడు నిర్మించిన మొట్టమొదటి సీఎం వైఎస్సారే. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1,80,817 ఇళ్లు మంజూరు చేసి అందులో 1,63,140 ఇళ్లను పూర్తిచేశారు.
● నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న సంకల్పంతో 2007లో ప్రారంభించిన ఆరోగ్యశ్రీతో వేలాది మందికి జీవం పోశారు. 108 అంబులెన్స్‌లు, 104 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
● పేద విద్యార్థులకు కూడా కార్పొరేట్ చదు వులు అందించాలనే ఉద్దేశ్యంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు.ఈ పథకం ద్వారా లబ్థిపొందిన వారిలో బీసీ విద్యార్థులే మన జిల్లాలో 72వేలమందికి పైగా ఉన్నారు.
నరసన్నపేట: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని మంగవారం పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన చేశారు. అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో జయంతి వేడుకలు చేయాలని, సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పార్టీ ప్రతినిధులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
జిల్లాలో అడుగడుగునా
రాజన్న జ్ఞాపకాలు
నాటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే
జిల్లా ప్రగతికి సోపానాలు
నేడు వైఎస్సార్ జయంతి