ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడాలి
● ఆఫ్‌షోర్ నిర్వాసితుల నిరసన
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆఫ్‌షోర్ నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ. సింహాచలం డిమాండ్ చేశారు. ఈ మేరకు నిర్వాసితులతో కలిసి జిల్లా జెడ్పీ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 18 ఏళ్లుగా ప్రాజెక్టు పని నత్తనడకగా సాగుతోందని ధ్వజమెత్తారు. నిర్వాసితులు చాలా రోజులుగా రిలే దీక్షలు చేపడుతున్నా కూటమి ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం అన్యాయమన్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచినప్పటికీ నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
సమావేశం ఏర్పాటు చేయాలి
జిల్లాలో ఉన్న మంత్రులు, పలాస, పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యేలు జోక్యం చేసుకొని, నిర్వాసితులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సమస్య పరిష్కారమయేంతవరకు ఎంతటి పోరాటమైన కొనసాగిస్తామని పిలుపునిచ్చారు. 18 ఏళ్ల నిండిన యువతి, యువకులకు యూత్ ప్యాకేజీ మంజూరు చేయాలని, నిర్వాసితులందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూములకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. హిరమండలం నిర్వాసితులకు ఇచ్చిన 460 జీవో ప్రకారం పూర్తిస్థాయి ప్యాకేజీ ఇవ్వాలన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. అనంతరం డీఆర్‌వో నిర్వాసితులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్, ప్రభుత్వం దృష్టిలో పెడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.యుగంధర్, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి లండ వెంకటరావు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శిర్ల ప్రసాద్, చీపురుపల్లి గ్రామ సర్పంచ్ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


