యోగా దినోత్సవం విజయవంతం చేయండి
శ్రీకాకుళం పాతబస్టాండ్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న జరిగే యోగాలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్’ అనే థీమ్‌తో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ సుబ్బారెడ్డి సత్తి ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. అదే విధంగా, అలాగే రానున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కులగణన హర్షనీయం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ)/శ్రీకాకుళం పాతబస్టాండ్: దేశవ్యాప్తంగా జనగణనతో పాటే సమగ్ర కుల గణన జరిపించేందుకు షెడ్యూల్ ప్రకటించి ఈ నెల 16న గెజిట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రచురించడంపై ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర అధ్యక్షుడు కొమ్ము రమణమూర్తి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 16 ఏళ్ల తర్వాత ప్రజలందరి ఆర్థిక– సామాజిక వివరాలతో సమగ్రంగా జనగణన జరపాలనుకోవడం అభినందనీయమన్నారు. తొలిసారిగా జనగణనలో పౌరులే స్వయంగా ఆన్‌లైన్‌లో తమ వివరాలు నమోదు చేసుకునే అవకాశం కూడా కేంద్రం కల్పించిందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఓబీసీల జనాభా కచ్చితంగా తెలిసేలా వెనుకబడిన తరగతులకు చెందిన జాతీయ స్థాయిలోని 3,746 కులాలు, రాష్ట్రస్థాయిలోని 139 కులాలకు చెందిన కుటుంబాల వారందరూ, తమ జనాభా లెక్కలతో పాటు కుల వివరాలు కూడా స్పష్టంగా తెలియజేయాలన్నారు.


