
ఇసుక దోపిడీ జరుగుతున్న ప్రాంతాలివే
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
జిల్లాలో ఇసుక దోపిడీ పతాక స్థాయిలో జరుగుతోంది. అనుమతుల్లేకుండా ర్యాంపులు నిర్వహించి, అడ్డగోలుగా తవ్వకాలు జరిపి విక్రయిస్తున్నారు. మరికొన్ని చోట్ల అనుమతులు ఒక దగ్గర, తవ్వకా లు మరో చోట జరిపి ఇసుకను స్వాహా చేస్తున్నారు. కొన్ని చోట్ల అనుమతులకు మించి తవ్వకాలు జరి పి, సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ తవ్వకాలు ఒక ఎత్తు అయితే ఆ అక్రమ ఇసుకను తరలించేందుకు నకిలీ బిల్లులు సృష్టించడం మరో ఎత్తు. అంతా కలిసి ఇసుక మాఫియాగా మారి ఇప్పటికే రూ.వేల కోట్లు మింగేశారు. ఇసుక దోపిడీ నేరమని సాక్షాత్తు సుప్రీం కోర్టే చెప్పినా కూటమి ప్రభుత్వంలో నాయకులు లెక్క చేయడం లేదు.
అడ్డగోలుగా...
ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. నదుల గర్భంలోనే యంత్రాలు పెట్టి తవ్వకాలు చేపడుతున్నారు. మంచినీటి బావులు, వంతెనలకు ముప్పు వాటి ల్లేలా తవ్వకాలు చేస్తున్నారు. అక్రమార్కుల దెబ్బకు కొన్నిచోట్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మరికొన్ని చోట్ల తవ్వకాలతో ఏర్పడిన గుంతల కారణంగా సముద్రం బ్యాక్ వాటర్ వచ్చేసి నదీ జలాలు ఉప్పునీటిమయమైపోయాయి. మరికొన్ని చోట్ల నదులను ఎక్కడికక్కడ తవ్వేసి, పెద్ద పెద్ద గోతులు చేయడంతో ప్రమాదాలకు తావిస్తున్నా యి. కొన్ని చోట్ల నదులు దీవుల్లా కన్పిస్తున్నాయి. అక్రమ రవాణా సాగిస్తున్న లారీలతో రోడ్లు ఛిద్రమైపోతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది రోడ్లు పాడవడం వల్ల ప్రమాదాలకు గురై మరణించడం, తీవ్రగాయాలపాలవ్వడం జరిగింది.
నకిలీ బిల్లుల సృష్టి
బిల్లులు లేకపోతే ఆకస్మిక తనిఖీల్లో ఎక్కడ పట్టుబడిపోతా మో అన్న ముందు చూపు తో అక్రమార్కులు ఎక్కడికక్కడ యంత్రాంగం వినియోగిస్తున్న డివైజ్‌లను పోలిన డివైజ్‌లను కొనుగోలు చేసి నకిలీ బిల్లులు తయారు చేస్తున్నారు. అధికారులు జారీ చేసిన బిల్లుల్ని పోలిన విధంగా నకిలీ బిల్లులు ఉంటున్నాయి. ఏ ర్యాంపు నుంచైతే తీసుకొస్తున్నారో ఆ ర్యాంపు లేదా మరో ర్యాంపు పేరుతో నకిలీ బిల్లులు సృష్టిస్తున్నారు. దాదాపు అక్రమంగా ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ జిల్లాలో నకిలీ డివైజ్‌లు వాడుతున్నారు. నకిలీ డివైజ్‌లతో బిల్లులు సృష్టిస్తున్నారని తెలిసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇసుక దందా చేస్తున్న వారంతా నాయకులు కావడంతో వారి జోలికి పోవడం లేదు. దీంతో తనిఖీల సమయంలో సిబ్బంది కూడా గుర్తించలేకపోతున్నారు. యంత్రాంగం జారీ చేసిన బిల్లులు మాదిరిగా ఉండటంతో వదిలేస్తున్నారు. పక్కాగా గమనించి, ఆ ర్యాంపు వద్ద ఆరా తీసి, కచ్చితంగా వ్యవహరిస్తే తప్ప పట్టుకోలేని పరిస్థితి నెలకొంది. తాజాగా పైడిభీమవరం చెక్ పోస్టు పక్కాగా, కచ్చితంగా పరిశీలించడంతో నకిలీ బిల్లులతో రవాణా సాగిస్తున్న లారీల గుట్టు రట్టు అయింది. సీఐ అవతారం ఆధ్వర్యంలో తనిఖీలు జరగ్గా, పట్టుబడ్డ లారీలను మైనింగ్ అధికారులకు అప్పగించారు.
జిల్లాలో ఆమదాలవలస నియోజకవర్గంలోని తొగరాం పంచాయతీ దిబ్బలపేట, ముద్దాడ పేట, కాఖండ్యాం, నారాయణపురం, పురుషోత్తపురం, చినంకలాం, నిమ్మ తొర్లాడ, దూసి, తోటాడ, అక్కివరం, బెలమం, లొద్దలపేట, కొత్తవలస, సింగూరు, నైరా, అంబళ్లవలస. శ్రీకాకుళం నియోజకవర్గంలోని భైరి, కరజాడ, బూరవల్లి, కళ్లేపల్లి, కిల్లిపాలెం, పొన్నాం, బట్టేరు, గార. నరసన్నపేట నియోజకవర్గంలోని మడపాం, పర్లాం, రామకృష్ణాపురం, శ్రీముఖలింగం, దొంపాక,లుకలాం, బుజ్జిపేట, చేనువలవలస, చెవ్వాకులపేట, గోపాలపెంట, ఉర్లాం, ఇచ్ఛాపురం నియోజకవర్గంలో బిర్లంగి, బొడ్డవడ, ఈదుపురం, కేసుపురం, కొలిగాం, ఇచ్ఛాపురం టౌన్ పరిధిలో బహుద నది కొత్త, పాత బ్రిడ్జిల దగ్గర, పాతపట్నం నియోజకవర్గంలోని ఆకులతంపర, పాత పొనుటూరు, హిరమండలం మండలంలోని పలు గ్రామాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, దోపిడీ జరుగుతోంది.