
సూదికొండ మిగలకుండా..
ఈ ఫొటోలో కనిపిస్తున్న కొండ పేరు సూదికొండ. పలాస–కాశీబుగ్గలో ఉంది. కూటమి ప్రభుత్వంలో కొండల్ని ఎలా కొల్లగొడుతున్నారో చెప్పడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. గ్రావెల్ కోసం మట్టి మాఫియా దాష్టీకానికి ఒడిగట్టింది. అక్రమార్కులకు సూదికొండ ఆదాయ వనరుగా మారింది. అనుమతుల పేరుతో ఇప్పటికే సగానికి పైగా కొండను తవ్వేశారు. మిగతాది తవ్వేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇలాగే వదిలేస్తే సూదికొండ మిగలకుండా పోతుంది.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
కూటమి ప్రభుత్వంలో విధ్వంసం పతాకస్థాయికి చేరుతోంది. ముఖ్యంగా పలాస నియోజకవర్గంలో సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయి. పచ్చని కొండలు ఛిద్రమైపోతున్నాయి. కొండలు వన్యప్రాణులకు నెలవుగా ఉంటాయి. పర్యావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. తుఫాన్‌లు ఇతరత్రా ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణగా నిలుస్తాయి. కానీ, ఇప్పుడా కొండలపైనే కూటమి నేతల కన్ను పడింది. అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టి దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు. పలాస నియోజకవర్గంలో సూదికొండపై గ్రావెల్ మాఫియా బరితెగించింది. రేయింబవళ్లు దర్జాగా తవ్వి తరలించేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇప్పటికే సూదికొండ సగానికి పైగా తరిగిపోయింది. స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా రెవెన్యూ, గనుల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం రెవెన్యూ పరిధిలో గల సర్వే నంబర్ 51లో 60 ఎకరాల విస్తీర్ణంలో సూదికొండ ఉంది. 2014–19లోనే పట్టణంలోని సూదికొండపై తమ్ముళ్ల కన్ను పడింది. ఇష్టారీతిన తవ్వకాలు చేపట్టారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక చాలావరకు నిలువరించారు. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక బరితెగించారు. ఎవరి హయాంలో విధ్వంసం ప్రారంభమైందో వారి హయాంలోనే మళ్లీ జడలు విప్పింది. విచిత్రమేమిటంటే అక్కడ క్వారీకి అధికారులు అనుమతులు ఇచ్చారని చెప్పి చెలరేగిపోతున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన నాయకుడు ఇదే మంచి అవకాశంగా తీసుకున్నారు. ఇష్టారీతిన తవ్వి తరలించేస్తున్నారు. మరోవైపు ఎంఐజీ లే అవుట్‌కు తరలిస్తున్నామంటూనే ఎక్కడెక్కడికో రవాణా చేసేస్తున్నారు. కేంద్రీయ విద్యాలయం కోసమని కూడా తవ్వకాలు జరుపుతున్నారు. చదును పేరుతో గ్రావెల్ బిజినెస్ చేస్తున్నారు. రూ.కోట్లలో అక్రమార్కులు ఆర్జిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే కొన్నాళ్లకు ఇక్కడొక సూదికొండ ఉండేది అని చెప్పుకునే పరిస్థితి వచ్చేసినా ఆశ్చర్యపడనక్కర్లేదు.
కొండను కొల్లగొట్టేస్తున్న కూటమి పెద్దలు
ఇప్పటికే సగానికిపైగా గుండు కొట్టేసిన వైనం
పతాక స్థాయికి చేరిన విధ్వంసం

సూదికొండ మిగలకుండా..

సూదికొండ మిగలకుండా..

సూదికొండ మిగలకుండా..