
గంధపు చెట్లు నరికివేతపై ఫిర్యాదు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని సూర్యమహాల్ సమీప జామియా మసీదు వద్ద గంధం చెట్ల నరికివేతకు అంశం శుక్రవారం వెలుగులోకి వచ్చిన సంగతి విధితమే. శుక్రవారం నాటికి ఒక చెట్టునే తరలించారనుకున్న మత పెద్దలు శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అటవీశాఖ అధికారులతో కలసి మొత్తం 12 ఎకరాలను కలియదిరగ్గా మరో మూడు చెట్లు నరికివేతకు గురై మాయమైనట్లు నిర్ధారణకొచ్చారు. ఒకటో పట్టణ పోలీసులు, స్పెషల్ బ్రాంచి పోలీసులు సైతం శనివారం ఈ ఘటనపై ఆరా తీశారు. ఎస్‌ఐ ఎం.హరికృష్ణ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మొత్తం 12 ఎకరాల్లో కొబ్బరి, టేకు, గంధం, ఇతర చెట్లు అనేకమున్నాయని, గంధం చెట్లు నరికివేయడం ఘోరమని, చివరిసారిగా కొబ్బరి, టేకు చెట్లు ఫలసాయాన్ని వేలం పాట ద్వారా దక్కించుకున్న సర్ఫరాజ్ భయ్యాపై అనుమానాలున్నాయని న్యాయవాది ఎం.అసదుల్లా, ఎం.ఏ.రఫీ, జాఫర్ ఘోరీ, బాషా, రవూఫ్ ఖాన్, ఆర్.టి.ఖాన్, అమానుల్లా, ఢిల్లీఖాన్, షేక్ మదీనాలు అనుమానం వ్యక్తం చేశారు. అటవీశాఖ, పోలీసు అధికారులు సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్ సాధిక్ మాట్లాడుతూ రంజాన్‌తో పాత కమిటీ కాలం ముగియడంతో ప్రస్తుతం తానే ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నాని, శుక్రవారం సమాచారం మత పెద్దల ద్వారా చేరిందని, శనివారం నాలుగు చెట్లు పోయినట్లు లిఖితపూర్వక ఫిర్యాదు అందడంతో చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వక్ఫ్‌బోర్డు పరంగా కేసు నమోదు చేస్తామన్నారు. అటవీశాఖ శ్రీకాకుళం ఇన్‌స్పెక్టర్ సాయిరాం మహాపాత్రో మాట్లాడుతూ రంపంతో తొలగించిన ఆనవాళ్లున్నాయని, వాటిని శ్రీగంధం చెట్లుగా నిర్ధారించామన్నారు. వన్‌టౌన్ ఎస్‌ఐ ఎం.హరికృష్ణ మాట్లాడుతూ ఫిర్యాదు అందిందని, విచారణ చేస్తున్నామని చెప్పారు.