
సర్టిఫికెట్ల పరిశీలన
హెచ్‌ఎంల పదోన్నతులకు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఉపాధ్యాయ సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లా పరిషత్, మున్సిపల్ హైస్కూల్స్‌లో ఖాళీ (మొత్తం 83)గా ఉన్న గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మొదలైంది. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికగా సీనియారిటీ జాబితాలో ఉన్న ఉపాధ్యాయులకు 1:2 రేషియోలో మొదటిరోజు 166 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తిచేశారు. డీఈఓ సదాశివుని తిరుమల చైతన్య నేతృత్వంలో డిప్యూటీ డీఈఓలు ఆర్.విజయకుమారి, పి.విలియమ్స్ ఆధ్వర్యంలో సీనియర్ హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, డీఈఓ కార్యాలయ సిబ్బందితో కూడిన స్క్రూటినీ కమిటీలు ఉద్యోగ పదోన్నతి పొందనున్న స్కూల్ అసిస్టెంట్ల అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను, సర్వీస్ రికార్డులను క్షున్నంగా పరిశీలించారు. కొన్ని రిమార్కులను గుర్తించారు. కాగా హెచ్‌ఎంల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌తోపాటు 3142 మంది స్కూల్ అసిస్టెంట్లు, 2550 సెకండరీ గ్రేడ్ టీచర్ల కౌన్సెలింగ్ పోస్టుల వెరిఫికేషన్ సైతం పూర్తి చేయడం గమనార్హం. బుధవారం మిగిలిన ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల తనిఖీతోపాటు బదిలీలకు సంబంధించి 131 ఎస్‌జీటీల పోస్టుల వెరిఫికేషన్ పూర్తి చేయనున్నట్టు డీఈఓ తెలిపారు.
ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి..
గ్రేడ్–2 హెచ్‌ఎం పదోన్నతుల్లో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరుతూ బహుజన టీచర్స్ అసోసియేషన్‌తో కలిపి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘ జిల్లాశాఖ ప్రతినిధులు డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తమకు 15 శాతం హక్కుగా రావాల్సిన 12 పోస్టులను ఎస్సీ,ఎస్టీలకు మాత్రమే కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం బోనెల రమేష్, వడమ శరత్, దార్ఘాశి గణేష్, పడాల ప్రతాప్‌కుమార్, షన్ముఖరావు, కృష్ణమోహన్ తదితరులు డీఈఓకు వినతిపత్రం అందజేశారు.