
ధీమా ఇవ్వని బీమా
ఆమదాలవలస: కూటమి ప్రభుత్వం వచ్చాక సాధారణ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదానికి రూ.10 లక్షలు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశారు. గతేడాది మార్చి నుంచి ఇప్పటివరకు చిల్లు గవ్వ కూడా విదల్చలేదు. దీంతో సుమారు 3500 కుటుంబాలు ఇంటి పెద్ద దిక్కు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. చంద్రన్న బీమా కోసం బాధిత కుటుంబాలు సచివాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు తప్ప చిల్లిగవ్వ కూడా విదల్చడం లేదు.
ఇదీ పరిస్థితి..
2014–19 హయాంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం చంద్రన్న బీమా పథకాన్ని తీసుకొచ్చింది. కుటుంబ పెద్దను కోల్పోతే సహజ మరణమైతే రూ.రెండు లక్షలు, ప్రమాదంలో మరణిస్తే రూ. 5లక్షలు ఇచ్చేలా పథకాన్ని రూపొందించారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వైఎస్సార్ బీమా పేరిట 2021–22లో జిల్లాలో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన సుమారు 1600 మంది కుటుంబాలకు, 2022–23లో 1650 కుటుంబాలకు, 2023–24లో 1200 కుటుంబాలకు వైఎస్సార్ బీమా కింద సొమ్ము అందించింది.
హామీ అమలుకు మోక్షమెప్పుడో?
తాము అధికారంలోకి వస్తే చంద్రన్న బీమా మళ్లీ అమల్లోకి తెస్తామని ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలకు సహజ మరణానికి(50 ఏళ్లలోపు) రూ.ఐదు లక్షలు, ప్రమాద మరణాలకు రూ.పది లక్షలు బీమా పరిహారం ఇస్తామని కూటమి నేతలు తమ మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పటికి అధికారంలో కొచ్చి ఏడాది కావస్తున్నా చంద్రన్న బీమా అమలుకు నోచుకోలేదు. పథకం అమలుకు సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలను విడుదల చేయలేదు. గత ప్రభుత్వంలో వైఎస్‌ఆర్ బీమా కింద నమోదైన మరణాలను బట్టి చూస్తే జిల్లాలో ఏడాదికి సుమారు 15 వందలకు పైబడి ఉంటాయని అధికారులు అంచనాలు వేస్తున్నారు. గత ఏడాది ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మార్చి నుంచి ఇప్పటివరకు ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన ఏ ఒక్క కుటుంబానికి బీమా పరిహారం అందలేదు. దీంతో ఆయా ఇళ్ల మహిళలు పిల్లలతో కుటుంబాన్ని నెట్టుకురాలేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంద్రన్న బీమా అమల్లోకి వచ్చి ఉంటే కుటుంబానికి కొంత ఆర్థిక సాయం అందేది. ఈ విషయమై సచివాలయాలకు వెళ్తే ఇంకా ప్రభుత్వం విధి విధానాలు విడుదల చేయలేదని, వచ్చిన తర్వాతే ఆన్‌లైన్ చేయడం కుదురుతుందని ఉద్యోగులు చెబుతుండడంతో బాధితులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.
జాప్యం ఎందుకో?
కూటమి నేతలు ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి చంద్రన్న బీమాపై ఆర్భాటంగా ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక అమలులో తాత్సారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయకుండా పేదలకు తీవ్ర అన్యాయం చేస్తోంది. పది నెలలు కాలంగా చంద్రన్న బీమాకు అర్హులైన నిరుపేదలకు అన్యాయం జరిగింది. వారికి వెంటనే అమలు చేసి న్యాయం చేయాలి.
– బొడ్డేపల్లి రమేష్‌కుమార్,
వైఎస్సార్ సీపీ మున్సిపల్ మాజీ ఫ్లోర్‌లీడర్,
ఆమదాలవలస మున్సిపాలిటీ
అమల్లోకి రాని చంద్రన్న బీమా పథకం
కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదవుతున్నా పట్టించుకోని పాలకులు
పెద్దదిక్కును కోల్పోయి రోడ్డున పడుతున్న కుటుంబాలు

ధీమా ఇవ్వని బీమా

ధీమా ఇవ్వని బీమా