
సీహెచ్‌ఓల సమస్యలు పట్టవా?
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది పేద ప్రజలకు వైద్యసేవలందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమంటే కూటమి ప్రభుత్వం కనీసం కన్నెత్తి చూడకపోవడం బాధాకరమని వైఎస్సార్‌సీపీ నాయకురాలు, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఎం.వి.పద్మావతి అన్నారు. కొన్ని రోజులుగా మండుటెండలో ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. శ్రీకాకుళం నగరంలో మహాత్మాజ్యోతిరావుపూలే పార్కు వద్ద జరుగుతున్న ధర్నా వద్దకు వెళ్లి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్‌హెచ్‌ఎం కింద పనిచేస్తున్న సీహెచ్‌ఓలు రెండేళ్లుగా జీతభత్యాల విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఆరేళ్లు దాటిన సీహెచ్‌ఓలను క్రమబద్ధీకరించాలన్న జీవోను వెంటనే అమలుజేయాలని కోరారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ చేయాలని కోరారు. పని ఆధారిత ప్రోత్సాహాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్ ఓను పునరుద్ధరించాలని, క్లీనిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఉషారాణి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇందుమతి, జిల్లా కో–ఆర్డినేటర్ సీహెచ్ రాజీవ్, జి.రాఘవ తదితరులు పాల్గొన్నారు.