చిల్లంగి నెపంతో చంపేశారు..
● అనుమానాస్పద మృతిని ఛేదించిన ఎచ్చెర్ల పోలీసులు ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ వివేకానంద
శ్రీకాకుళం క్రైమ్/ఎచ్చెర్ల క్యాంపస్ : తన కుమారుడిని చిల్లంగి పెట్టి చంపేశాడన్న మూఢ నమ్మకంతో ఓ వ్యక్తి తన కుటుంబీకులతో దారుణానికి ఒడిగట్టాడు. అన్యాయంగా ఓ వ్యక్తిని చంపేశాడు. ముందు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన ఎచ్చెర్ల పోలీసులు చివరికి హత్య కేసుగా ధృవీకరించారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీ వివేకానంద వివరాలు వెల్లడించారు.
అనుమానాస్పద మృతిగా..
ఎచ్చెర్ల మండలం అజ్జరాం గ్రామానికి చెందిన బోర ఈశ్వరరావు గతేడాది డిసెంబరు 15న అదే గ్రామ పరిధిలోని కాష్యూ గార్డెన్ సమీపంలో మృతదేహంగా కనిపించాడు. ఎచ్చెర్ల ఎస్‌ఐ సందీప్ అదే రోజు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈలోగా మృతుని పోస్టుమార్టం రిపోర్టును సంబంధిత వైద్యులు ఇచ్చారు. అందులో మృతుడి మెడ చుట్టూ ఉన్న లిగేచర్ మార్క్, తలలో రక్తస్రావం ఆధారంగా మృతుడు ఈశ్వరరావుని ఎవరో తీవ్రంగా కొట్టి, మెడ నొక్కి చంపినట్లు గుర్తించారు. దీంతో కేసును జె.ఆర్.పురం సీఐ ఎం.అవతారం హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విచారణలో అనేక విషయాలు..
అజ్జరాం గ్రామానికి చెందిన బోర ఆదినారాయణ కుమారుడు బోర సాయి గిరిధర్ రెడ్డి (24) జ్వరంతో బాధపడుతుండేవాడు. రూ.11 లక్షలు ఖర్చు పెట్టినప్పటికీ ఫలితం లేకపోవడంతో 2024 జూలైలో చనిపోయాడు. తన కుమారుని చావుకి బోర ఈశ్వరరావే కారణమని, చిల్లంగి పెట్టి చంపివుంటాడని గట్టిగా నమ్మాడు. దీంతో అతని సోదరుడు బోర సంజీవరెడ్డి, మేనల్లుడు నగిరెడ్ల గోవిందు (లావేరు మండలం, సీతాపురం)లతో కలిసి ఎలాగైనా ఈశ్వరరావును తుదముట్టించాలనుకున్నాడు.
ఇలా చంపేశారు..
గతేడాది డిసెంబరు 15న అజ్జరాం గ్రామం సమీపంలోనే ఈశ్వరరావును దారి కాచి ముందుగా కొట్టారు. అనంతరం పురుగుల మందు తాగించి మెడ చుట్టూ తువ్వాలు చుట్టి బిగించి చంపేశారు. మంగళవారం సాయంత్రం ఏ–1 నిందితుడైన బోర ఆదినారాయణను అజ్జరాంలోని అతని తోట వద్దే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నిజాన్ని అంగీకరించాడు. బుధవారం ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి తువ్వాలు, పురుగుల మందు సీసా స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ అవతారం ఆధ్వర్యంలోని ఎచ్చెర్ల పోలీసులను డీఎస్పీ వివేకానంద అభినందించారు.
చిల్లంగి నెపంతో చంపేశారు..


