శ్రీకాకుళం: జిల్లాకే ప్రధాన ఆస్పత్రిగా ఉన్న రిమ్స్ సర్వజన ఆస్పత్రిలో ఇన్ని సమస్యలు ఉంటే ఎలా అని కలెక్టర్ దినకర్ పుండ్కర్ హాస్పిటల్ అధికారులను ప్రశ్నించారు. రోగులు, విద్యార్థులు, వైద్యులు పడుతున్న ఇబ్బందులపై ఇటీవల ‘సాక్షి’లో పలు కథనాలు రావటంతో పాటు వ్యక్తిగతంగా కొన్ని ఫిర్యాదులు అందటంతో శుక్రవారం రిమ్స్ ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డుల్లో రోగులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నీటి సమస్య ఉందని గుర్తించిన కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు. పెద్దగా సమస్య లేదని రిమ్స్ అధికారులు చెప్పగా.. అక్కడే ఉన్న వాష్ బేసిన్ వద్ద ట్యాప్ విప్పగా నీరు రాలేదు. దీంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్లు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. రెండో బోరు ఏర్పాటు చేయాలని ఏపీహెచ్‌ఎంహెచ్‌ఐడిసీ ఈఈని ఆదేశించారు. లిఫ్టు సమస్యలపై ఆరా తీశారు. హాస్టల్ సమస్యలపై దృష్టి సారించాలన్నారు. అనంతరం హెచ్‌ఓడీలతో సమావేశమయ్యారు. ఖాళీ పోస్టుల వివరాలను తెలియజేస్తే భర్తీకి చర్యలు తీసుకుంటానని చెప్పారు. మే మొదటి వారం నాటికి ఆస్పత్రి సలహా మండలి సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ షకీల, ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటాచలం, ఆర్‌ఎంఓలు డాక్టర్ సుభాషిని, డాక్టర్ భానుప్రకాష్, డాక్టర్ షర్మిళ, డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్ సీపీ శ్రీదేవి, డాక్టర్ ప్రసన్న కుమార్, డాక్టర్ డి.పార్వతి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అసంతృప్తి


