వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని కేశవరావుపేట పంచాయతీ కింతలి మిల్లు కూడలి వద్ద జాతీయ రహదారిపై గురువారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రామకృష్ణ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. విజయనగరం జిల్లా రేగిడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఈయన ద్విచక్ర వాహనంపై చిలకపాలెం వైపు వెళ్తుండగా.. కింతలి మిల్లు సమీపంలో పంక్చర్ కావటంతో ఆగి ఉన్న లారీని ఢీకొట్లాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన రామకృష్ణను 108 అంబులెన్సు ద్వారా శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్పించారు. వైద్యులు కేజీహెచ్‌కు రిఫర్ చేయగా.. ఆస్పత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటబొమ్మాళి మండలానికి చెందిన సీహెచ్ రవి, డి.ప్రసాద్‌లు ద్విచక్ర వాహనంపై టెక్కలి వైపు వెళ్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి రహదారి పక్కగా ఉన్న కల్వర్టులోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో బైకుపై ఉన్న ఇద్దరూ గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే హైవే అంబులెన్స్‌లో టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


