సమస్యలు పరిష్కరించాలి
● ఆర్టీసీ ఈయూ జోనల్ కార్యదర్శి మూర్తి
శ్రీకాకుళం అర్బన్: జిల్లాలో ఆర్టీసీ పరిధిలోని శ్రీకాకుళం–1, 2 డిపోలు, టెక్కలి, పలాస తదితర నాలుగు డిపోల్లో పేరుకుపోయిన ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి బి.కె.మూర్తి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం కాంప్లెక్స్ ఆవరణలోని ఈయూ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమ సస్పెన్షన్లు, అక్రమ బదిలీలు రద్దు చేసి 1/2019 సర్క్యూలర్ అమలు చేయాలని కోరారు. ఆర్టీసీలో కొంతమంది ఉద్యోగులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉద్యోగులను ఉద్యమాలవైపు నెడుతున్నారన్నారు. ఇటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 3, 4 తేదీల్లో జిల్లాలోని నాలుగు డిపోల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే విజయనగరం జోన్‌లో 19 డిపోల్లో ఉద్యమం చేస్తామన్నారు. ఆయనతో పాటు ఈయూ నాయకులు ఎ.దిలీప్‌కుమార్, జి.త్రినాథ్, కేజీరావు తదితరులు ఉన్నారు.


