రణస్థలం: దేశ భద్రతలో యువత భాగస్వాములవ్వాలని సీఐఎస్‌ఎఫ్ జవాన్లు పిలుపునిచ్చారు. సీఐఎస్‌ఎఫ్ సీనియర్ కమాండెంట్ సతీష్ కుమార్ బాజ్‌పే, డిప్యూటీ కమాండెంట్ వినీత్ కుమార్ ప్రభాకర్‌ల ఆధ్వర్యంలో 80 మంది సభ్యుల సైకిల్ యాత్ర సోమవారం రణస్థలం చేరుకుంది. దీంతో వీరికి తహసీల్దార్ ఎన్.ప్రసాద్, వివిధ పాఠశాలల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో డిజిటల్ స్క్రీన్‌పై సీఐఎస్‌ఎఫ్ విధులు, దేశ భద్రతలో పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సీఐఎస్‌ఎఫ్ ఏర్పాటు చేసి 56 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప
శ్చిమబెంగాల్‌లోని బకేలి నుంచి ఒక బృందం, గుజరాత్‌లోని లఖపథ్ నుంచి ఒక బృందం సైకిల్ యాత్ర ప్రారంభించామని తెలిపారు. 9 రాష్ట్రాల్లో 25 రోజుల పాటు 6,553 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టి మార్చి 31న కన్యాకుమారిలో ముగిస్తామన్నారు. మాదక ద్రవ్యాల రవాణా నిషేధం, ఆక్రమ ఆయుధాల నివారణ, తీరప్రాంత భద్రత, తీవ్రవాదుల చొరబాటు నివారణ, మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నామని వెల్లడించారు. సమృద్ధ్ సంరక్షణ పేరుతో చేపట్టిన సైకిల్ ర్యాలీ ద్వారా ప్రజలను భద్రతా సిబ్బందితో మమేకం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కమాండెంట్లు ఏకే సింగ్, అమిత్ కుమార్, ఏకే మహాపాత్రో, షికార్ లోహియా, శ్రీనివాస్, ఎస్‌ఐ చిరంజీవి, మహిళ పోలీసు బమ్మిడి అమ్మోజీ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం క్రైమ్: తీరప్రాంత ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లాకు విచ్చేసిన సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) సైకిల్ ర్యాలీ సోమవారం ఉదయం విశాఖపట్నానికి బయల్దేరింది. జిల్లా మాజీ సైనిక సంఘ సభ్యులు కొత్తరోడ్డు జంక్షన్ వద్ద జెండా ఊపి ర్యాలీని సాగనంపారు. వీరితో పాటు ట్రాఫిక్ సీఐ నాగరాజు, రూరల్ ఎస్‌ఐ రాము తదితరులున్నారు.