సారవకోట: మండలంలోని వడ్డినవలస గ్రామంలో శుక్రవారం జిల్లాస్థాయి బల ప్రదర్శన పోటీలు సందడిగా నిర్వహించారు. శ్రీ త్రినాథస్వామి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఏటా ఈ జిల్లాస్థాయి బలప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నారు. 80 కిలోల విసురుగుండు పోటీలలో ఒప్పంగి గ్రామానికి చెందిన గేదెల సత్యనారాయణ ప్రథమ, ఆవల వసంతరావు ద్వితీయ బహుమతి పొందారు. అలాగే 100 కిలోల సంగిడి పోటీల్లో గేదెల సత్యనారాయణ, ఆవల గోవిందరావు మొదటి, ద్వితీయ బహుమతులు పొందారు. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో ఆవల గోవిందరావు 160 కిలోలు ఎత్తి ప్రథమ, గుజ్జల ట్వింకిల్ కుమార్ ద్వితీయ స్థానంలో నిలిచారు. మహిళల విభాగంలో దూబ హేమశ్రీ 95 కిలోలు ఎత్తిడంతో ప్రథమ బహుమతి పొందగా తాలాడ కావ్య 80 కిలోలు ఎత్తి ద్వితీయ స్థానం సాధించారు. ఈ వెయిట్ లిఫ్టింగ్ పోటీలను పీడీ ఈశ్వరరావు, పవర్ వెయిట్ లిఫ్టింగ్ గౌరవ అధ్యక్షుడు బి.తిరుపతిరావు సమక్షంలో నిర్వహించారు. విజేతలకు ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు, బగ్గు అర్చన, మెండ రాంబాబు తదితరులు బహుమతులు అందించారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఇప్పిలి ఆంజనేయ ప్రసాద్, ఇప్పిలి వేణులతో పాటు నిర్వహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా జిల్లాస్థాయి బలప్రదర్శన పోటీలు