
పెళ్లి చేసుకొని దళిత యువతికి మోసం
ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు
శ్రీకాకుళం క్రైమ్: ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని నమ్మించి పెళ్లి చేసుకున్నాడని.. తనతో ఒక బిడ్డను కన్నాక దళిత మహిళ అని ఒకే ఒక్క కారణంతో తనను వదిలించుకోవాలని చూసి, అంతకుముందే నిశ్చితార్థం చేసుకున్న మరో అమ్మాయితో పరారయ్యాడని ఒక బాధితురాలు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు యర్ర మంగ మ్మ ఇచ్చిన ఫిర్యాదులో మేరకు..
ఎచ్చెర్ల మండలం ధర్మవరం గ్రామానికి చెందిన తనని 2019లో లావేరు మండలం శిగిరి కొత్తపల్లి గ్రామానికి చెందిన యర్ర శంకరరావు ప్రేమిస్తునానని చెప్పి హైదరాబాద్ తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో మగబిడ్డను కన్నాక తనది దళిత కులమనే ఒక్క కారణంతో అయిష్టత పెంచుకుని హింసించడం ప్రారంభించాడు. దానికి శంకరరావు కుటుంబ సభ్యు లు అతనికి మద్దతు పలికేవారు. కొన్నిరోజులు మళ్లీ ప్రేమను చూపించి హైదరాబాద్ నుంచి శిగిరి కొత్తపల్లి గ్రామంలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్తానని నమ్మించాడు. పైడి భీమవరం ఫార్మా కంపెనీలో డ్యూటీ చేసేందుకు అక్కడే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని విధులకు వెళ్లేవాడు.
మరో అమ్మాయితో పరారీ
తన భర్త శంకరరావును పైడి భీమవరం నుంచి తమ ఇంటికి తీసుకెళ్లమని ఎన్నిసార్లు చెప్పినా తీసుకెళ్లేవాడు కాదని మహిళ పేర్కొంది. కారణం అడిగితే తన తల్లిదండ్రులు, అన్నదమ్ము లు దళిత మహిళను తీసుకురావడానికి వీళ్లేదని కుల పెద్దల సమక్షంలో తేల్చి చెప్పారని సమాధానమిచ్చాడని తెలిపింది. అంతేకాక అంతకు ముందు తన భర్తతో నిశ్చితార్థం జరిగిన దుర్గలక్ష్మి అనే అమ్మాయితో ఎటైనా వెళ్లిపోమని కుటుంబసభ్యులు సలహా ఇవ్వడంతో ఆమెతో కలిసి పరారయ్యాడని పేర్కొంది. ఇదే విషయ మై లావేరు పోలీసులకు నెల రోజుల క్రితం ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు పట్టించుకోలేదని, న్యాయం చేయమని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డిని ప్రాధేయపడింది.