
విద్యార్థులకు ఉద్యోగ కల్పనే లక్ష్యం
ఎచ్చెర్ల క్యాంపస్: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో వంద శాతం ప్లేస్‌మెంట్‌లు లక్ష్యంగా ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నట్లు స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ) డైరెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం ఉద్యోగ విజయోత్సవం (జాబ్ అచీవర్స్ డే) కార్యక్రమం ని ర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చివరి ఏడాది చదువుతున్న పాలిటెక్నిక్ డిప్లమా విద్యార్థులు 209 మంది 14 పరిశ్రమల్లో ఉద్యోగాలు సాధించారు. క్యాంపస్ ఎంపికల్లో సత్తాచాటారు. ఈ విద్యార్థులను ఉద్యోగ విజయోత్సవంలో అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. డైరెక్టర్ మాట్లాడుతూ రూ. 2.54 లక్షలు వార్షిక ప్యాకేజీ నుంచి రూ.1.02 లక్షలు ప్యాకేజీ మధ్య విద్యార్థులు ఎంపికై నట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను పూర్తిస్థాయిలో బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. రిలీవ్ నాటికి ప్రతి ఒక్కరూ ఉద్యోగం సాధించేలా నైపుణ్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కరిక్యులమ్, సిలబస్‌లో మార్పులు, పక్కాగా ప్రయోగాల నిర్వహణ, ఇంటర్న్‌షిప్ వంటివి అమలు చేస్తున్నట్లు చెప్పారు. పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభమైందని, జూన్ 3వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు. ప్రభుత్వ కళాశాల్లో చేరేందుకు విద్యార్థులు ప్రాధాన్యత ఇవ్వాలని వివరించారు. జిల్లాలో శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్, శ్రీకాకుళం మహిళల ప్రభుత్వ పాలిటెక్నిక్, టెక్కలి, ఆమదాలవలస, సీతంపేట పాలిటెక్నిక్‌ల్లో 780 సీట్లు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది 142025 మంది పాలిసెట్ –2024 పరీక్ష రా యగా, 124430 మంది ఉత్తీర్ణత సాధించారని అన్నారు. పాలిటెక్నిక్‌లో చేరిన విద్యార్థుల్లో నైపుణ్య కల్పన, ఉద్యోగ సాధనలకు ప్రాధాన్యత నిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సాంకేతిక విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎంఏవీ రామకృష్ణ, ప్రిన్సిపాల్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ బి.జానకిరామయ్య, ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ జి.దామోదర్‌రావు, టీపీ వో పి.యుగంధర్, అధ్యాపకులు మురళీకృష్ణ పాల్గొన్నారు.
శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగ విజయోత్సవం
హాజరైన స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ చదలవాడ నాగరాణి