
ఆమదాలవలస: భారత వాతావరణ కేంద్రం అందించిన సమాచారం మేరకు జిల్లాలో ఏప్రిల్ 2, 3 తేదీల్లో చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షం కురి సే అవకాశం ఉందని ఆమదాలవలస కృషి విజ్ఞా న కేంద్రం వాతావరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ మౌనిక శుక్రవారం తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వరిలో చివరి దఫా ఎరువులు వేసుకోవడానికి, చెరుకు, నువ్వులు వేసవి పెసర పంటల్లో ఎరువులు చల్లుకోవడానికి అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో వరిలో కాండం తొలుచు పురుగు ఆశించే అవకాశం ఉందని, నివారణకు ఎకరాకు క్లోరంత్రినిలిప్రోల్ 60 మిల్లీ లీటరు చొప్పున కలుపుకొని పిచికారీ చేయాలని సూచించారు. చెరుకు రైతులు కొరడా తెగులు నివారణకు ప్రొపికొనజోల్/ తెబుకనజోల్ 1 మిల్లీలీటరు లీటరు నీటికి చొప్పున కలిపి మొదళ్లు చెక్కిన వెంటనే ఒకసారి, నెల తర్వాత మరోసారి పిచికారీ చేయాలన్నారు.