
బాధ్యతలు స్వీకరిస్తున్న రాధాకృష్ణ
ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్‌లో ఉంచిన అరసవల్లి సూర్యనారాయణ స్వామి హుండీ ఆదాయాన్ని ఆలయ ఈఓ వి.హరిసూర్యప్రకాష్ ఆధ్వర్యంలో శుక్రవారం లెక్కించా రు. ఈ లెక్కింపులో నోట్లు రూపేణా రూ. 19,635, చిల్లర రూపేణా రూ. 74,281 లు మొత్తం కలిపి రూ. 93,916 ఆదాయం వచ్చినటు ఈఓ తెలిపారు. లెక్కింపును జిల్లా దేవదాయ ధర్మాదాయ శాఖ సూపరింటెండెంట్ బీవీవీఆర్ ప్రసాద్ పట్నాయక్, ఆలయ అర్చకులు ఇప్పిలి సందీప్ శర్మ, రైల్వే ఆర్‌ఎం ఎం.రవి పర్యవేక్షించారు.
సొండి కుల సంఘం రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం రేపు
టెక్కలి: టెక్కలిలో గల సొండి కుల సంక్షేమ సంఘం భవనంలో ఆదివారం రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహిస్తున్నట్లు సంఘం కార్యదర్శి జి.నాగభూషణరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి నిర్వహించనున్న ఈ సమావేశానికి సంఘం ప్రతినిధులంతా హాజరు కావాలని ఆయన కోరారు.
ఆర్టీసీలో కారుణ్య నియామకాలు
శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపడుతున్నట్లు ఆర్టీసీ డీపీటీఓ ఎ.విజయ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జనవరి 1, 2020 కు ముందు నెక్ రీజియన్ పరిధిలోని డిపోల్లో పనిచేస్తూ చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి శ్రీకాకుళం, విజయనగరం కలెక్టర్‌లు మొదటి విడత కారుణ్య నియామకాల్లో అర్హులైన కొందరికి ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. మిగిలిన వారి దరఖాస్తులను కలెక్టర్ కార్యాలయం నుంచి ఏపీఎస్ ఆర్టీసీ కార్యాలయానికి తిరిగి పంపించారన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఏపీఎస్ ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్, కండక్టర్, శ్రామిక్ పోస్టులను వారి అర్హతలను బట్టి భర్తీ చేసేందుకు సన్నాహాలు చేయడం జరిగిందన్నారు. అర్హులైన అభ్యర్థులు అవసరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవాలని ఆయన కోరారు.
కేన్సర్ బాధితుడికి
చిన్నారుల సాయం
కంచిలి: మండలంలోని పెద్దశ్రీరాంపురం గ్రామానికి చెందిన కేన్సర్ బాధితుడు లండ యోగేంద్రకు కంచిలికి చెందిన శ్రీ విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ చిన్నారులు సాయం చేశారు. యోగేంద్ర పరిస్థితిపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం వారిని కదిలించింది. వారి పాకెట్ మనీ నుంచి బాధితుడికి రూ.20వేలు అందించారు. ఈ మొత్తాన్ని బాధిత బాలుడి కుటుంబ సభ్యులకు పాఠశాల ఆవరణలో శుక్రవారం అందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతోపాటు పాఠశాల కరస్పాండెంట్ సీహెచ్ ఆదినారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కొత్తమ్మ తల్లి ఆలయ ఈఓగా రాధాకృష్ణ
కోటబొమ్మాళి: కొత్తమ్మ తల్లి ఆలయ కార్యనిర్వహణాధికారిగా వాకచర్ల రాధాకృష్ణ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం శ్రీకాకుళంలోని ఉమారుద్ర కోటేశ్వరాలయానికి గ్రేడ్–3 ఈఓగా పనిచేస్తున్నారు. గ్రేడ్–2 ఈఓగా పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. ఇక్కడ ఈఓగా పనిచేస్తూనే ఉమారుద్ర కోటేశ్వరాలయంతో పాటు పాలకొండ కోటదుర్గమ్మ ఆలయాలకు ఇన్‌చార్జి ఈఓగానూ వ్యవహరిస్తారు.


హుండీలో డబ్బులు లెక్కిస్తున్న అధికారులు