రైతులపై రాజకీయ పెత్తనం | - | Sakshi
Sakshi News home page

రైతులపై రాజకీయ పెత్తనం

Mar 21 2026 5:26 AM | Updated on Mar 21 2026 5:26 AM

ధర్మవరం రూరల్‌: రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని సర్కార్‌ కొలువుదీరాక రైతులపై రాజకీయ పెత్తనం పెచ్చుమీరిపోయింది. కబ్జాలు, ఆక్రమణలకు అంతేలేకుండా పోయింది. టీడీపీ నాయకులు తలచుకుంటే రోడ్లు, విద్యుత్‌ లైన్ల అలైన్‌మెంట్‌ కూడా మారిపోతోంది. తాజాగా ధర్మవరం మండలంలోని ఓ టీడీపీ నాయకుడి కోసం విద్యుత్‌ అధికారులు 33 కేవీ విద్యుత్‌ లైనుఅలైన్‌మెంట్‌ మార్చి ఇతర రైతుల పొలాల్లో స్తంభాలు నాటారు. దీనిపై బాధితులు కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్‌ తెచ్చినా ఏమాత్రం లెక్కచేయలేదు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఏకంగా పోలీసులను వెంట బెట్టుకుని వెళ్లి స్తంభాలు నాటారు.

అలైన్‌మెంట్‌ మార్చేసి..

అడ్డుకున్న వారిని ఈడ్చేసి

ధర్మవరం మండలం గొట్లూరు వద్ద సర్వే నంబర్‌ 624లో శ్రీరామరెడ్డి, నరసింహారెడికి 4.60 ఎకరాల పొలం ఉంది. పొలం పక్కనే తారురోడ్డు వెళ్తోంది. వీరికి రోడ్డుకు అటు వైపున కూడా కొంత భూమి ఉంది. ఇటీవల గొట్లూరు నుంచి సుబ్బరావుపేట వైపు 33 కేవీ విద్యుత్‌ లైను లాగుతున్నారు. విద్యుత్‌ శాఖకు చెందిన కాంట్రాక్టర్‌ విద్యుత్‌ స్తంభాలను శ్రీరామరెడ్డి, నరసింహారెడ్డి పొలం వద్దకు రాగానే రోడ్డుకు ఇటు పక్కన భూమిలో తొలుత విద్యుత్‌ స్తంభాలను నాటారు. ఆ లైను అలాగే టీడీపీ నాయకుని పొలం గుండా వెళ్లాల్సి ఉంటుంది. దీంతో టీడీపీ నాయకుడు ఆ శాఖ అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు తెచ్చాడు. అప్పటికే నాటిన విద్యుత్‌ స్తంభాలను పడగొట్టాడు. అంతేకాకుండా రాజకీయ నాయకులతో అధికారులకు ఫోన్లు చేయించాడు. దీంతో విద్యుత్‌ అధికారులు 33 కేవీ విద్యుత్‌ లైను అలైన్‌మెంట్‌ మార్చి శ్రీరామరెడ్డి, నరసింహారెడ్డి పొలంలో స్తంభాలు నాటేందుకు సిద్ధమయ్యారు. దీంతో బాధిత రైతులు కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్‌ తెచ్చారు. ఈక్రమంలోనే శుక్రవారం ఏకంగా 50 మంది పోలీసులు, విద్యుత్‌ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని విద్యుత్‌ స్తంభాలను రోడ్డుకు అటువైపున ఉన్న శ్రీరామరెడ్డి, నరసింహారెడ్డి చీనీ తోటలో నాటించారు. రైతు కుటుంబ సభ్యులు కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌ చూపినా పట్టించుకోలేదు. తమకు అన్యాయం చేయొద్దని వేడుకున్నా... వినకుండా వారందరినీ బలవంతంగా జీపులో ఎక్కించి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం విద్యుత్‌ స్తంభాలను నాటించారు.

టీడీపీ నాయకుడి కోసం

విద్యుత్‌ లైను అలైన్‌మెంట్‌ మార్పు

తమ పొలంలో స్తంభాలు నాటవద్దని వేడుకున్నా.. వినని అధికారులు

రైతు కుటుంబ సభ్యులను

ఈడ్చుకెళ్లిన పోలీసులు

స్టే ఆర్డర్‌ చూపినా పట్టించుకోని వైనం

న్యాయ పోరాటం చేస్తాం..

తొలుత అధికారులు మా చీనీతోటకు అటు వైపు ఉన్న మా స్థలంలోనే స్తంభాలను నాటారు. మా స్థలం తర్వాత టీడీపీ నాయకుడి పొలం ఉంది. దీంతో అతను తన స్థలంలో స్తంభాలు నాటడానికి ఒప్పుకోలేదు. నాటిన విద్యుత్‌ స్తంభాలనూ తొలగించాడు. దీంతో అధికారులు ఇటువైపున ఉన్న మా చీనీతోటలో విద్యుత్‌ స్తంభాలు నాటేందుకు ప్రయత్నించగా...హైకోర్టు నుంచి స్టే ఆర్డర్‌ను తీసుకొచ్చాను. వీటిని చూపినా... పోలీసులు లెక్క చేయలేదు. అడ్డుకున్న మా కుటుంబీకులను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం. – నరసింహారెడ్డి, రైతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement