అకాల నష్టంపై సమగ్ర నివేదిక | - | Sakshi
Sakshi News home page

అకాల నష్టంపై సమగ్ర నివేదిక

Mar 21 2026 5:26 AM | Updated on Mar 21 2026 5:26 AM

న్యూస్‌రీల్‌

జిల్లా వ్యవసాయాధికారి కృష్ణయ్య

బత్తలపల్లి: అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల వివరాలన్నీ నమోదు చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) కృష్ణయ్య తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే మండల స్థాయి వ్యవసాయాధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. శుక్రవారం ఆయన సాంకేతిక శాస్త్రవేత్త రామసుబ్బయ్యతో కలిసి బత్తలపల్లి మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ... అకాల వర్షాలతో పంటలు కోల్పోయిన రైతులందరికీ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు పలు గ్రామాల్లో పంటలు కోల్పోయిన రైతులతో మాట్లాడారు. తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు కన్నీరు పెట్టుకున్నారు. జిల్లా వ్యవసాయాధికారి వెంట తహసీల్దార్‌ స్వర్ణలత, ఎంపీడీఓ నరసింహనాయుడు, మండల వ్యవసాయాధికారి ఓబిరెడ్డి, విస్తరణ అధికారి శ్రీనివాసులు, గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీకాంత్‌రెడ్డి, రవి, బాలరాజు నాయక్‌, రాగిరి సోమశేఖర్‌ తదితరులు ఉన్నారు.

రేపటి నుంచి ఇంటర్‌ ‘స్పాట్‌’

పుట్టపర్తి: శనివారం జరగాల్సిన ఇంటర్మీడియెట్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ ఆదివారం కొత్తచెరువు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రారంభమవుతుందని ఇంటర్మీడియెట్‌ విద్య జిల్లా అధికారి చెన్నకేశవప్రసాద్‌ తెలిపారు. ఇంటర్‌ బోర్డు ఆదేశాల మేరకు 21వ తేదీ శనివారం ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, తెలుగు, హిందీ, హిస్టరీ, ఎకనామిక్స్‌ సబ్జెక్టుల స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ క్యాంప్‌ రంజాన్‌ సెలవు దృష్ట్యా ఆదివారానికి మార్చినట్లు వెల్లడించారు. ఆయా సబ్జెక్టులకు సంబంధించిన పరిశీలకులు 23వ తేదీ సోమవారం నుంచి హాజరుకావాలన్నారు. ఈ సబ్జెక్టుల అధ్యాపకులు అందరూ తప్పనిసరిగా క్యాంపునకు హాజరు కావాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement