● ఎస్పీ సతీష్‌కుమార్
పుట్టపర్తి టౌన్: పవిత్ర రంజాన్ పండుగను ముస్లింలంతా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ సతీష్‌కుమార్ సూచించారు. జిల్లాలోని ముస్లింలందరికీ ఆయన రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పర్వదినం శాంతి, సహనం, గౌరవం, దాతృత్వానికి ప్రతీక అన్నారు. అల్లాహ్ దీవెనలు జిల్లా ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రార్థనా స్థలాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
నేటి ‘పది’ పరీక్ష
ఏప్రిల్ 2కు వాయిదా
● ఓపెన్ స్కూల్ పరీక్షలు
ఈనెల 30కు వాయిదా
సాక్షి, పుట్టపర్తి: రంజాన్ పండుగ నేపథ్యంలో శనివారం జరగాల్సిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష ప్రభుత్వ వాయిదా వేసిందని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. వాయిదా పడిన ఇంగ్లిష్ పరీక్షను ఏప్రిల్ 2న ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షల్లో భాగంగా శనివారం 211–గణితం, 223–భారతీయ సంస్కృతి, వారసత్వం పరీక్షలు ఈనెల 30కు వాయిదా వేసినట్లు వెల్లడించారు. ఆరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయన్నారు.


