కొనసాగుతున్న ఉద్రిక్తత
అనంతపురం మెడికల్: పారిశుధ్య కార్మికుల ఆందోళనతో అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. 50 ఏళ్లు దాటిన వారు విధుల్లోకి రావొద్దంటూ పద్మావతి ఏజెన్సీ మేనేజర్లు హరి, సాయితేజారెడ్డి అల్టిమేటం జారీచేయడమే కాకుండా వారి స్థానాల్లో కొత్త కార్మికులను తీసుకున్నారు. దీంతో ఆదివారం పారిశుధ్య కార్మికులు, ఏజెన్సీ మేనేజర్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. కొత్త కార్మికులను పనిచేయకుండా అడ్డుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి.. కార్మికులను బయటకు పంపారు. ఇక్కడికి ఎవరూ రాకూడదని ఆంక్షలు విధించారు. దీంతో పారిశుధ్య కార్మికులు సర్వజనాస్పత్రి ముందు బైఠాయించారు. చివరకు పోలీసులు 16 మంది మహిళా పారిశుధ్య కార్మికులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రజారోగ్యం కోసం శ్రమిస్తున్న తమను విధుల్లోకి తీసుకోకపోగా అరెస్టు చేస్తారా అంటూ కార్మికులు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆందోళనకు దిగారు. మాలాంటోళ్లని ఇంత ఇబ్బంది పెడుతున్నారేంటంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కార్మికుల అరెస్టును వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్ పీరా, జిల్లా కార్యదర్శి అనిల్‌కుమార్ గౌడ్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, నాయకులు రామిరెడ్డి, ఏటీఎం నాగరాజు, ముర్తుజా, ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి ఖండించారు. సమస్యను ఎస్పీ జగదీష్, డీఎస్పీ శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లి మాట్లాడారు. అనంతరం కార్మికులను పోలీసులు విడిచిపెట్టారు.
50 ఏళ్లు దాటిన వారిని విధుల్లోకి తీసుకోని ఏజెన్సీ మేనేజర్లు
ఆందోళనకు దిగిన కార్మికులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
కొత్తవారిని ఇప్పుడే
తీసుకోవద్దు
పారిశుధ్య కార్మికుల సమస్య పరిష్కారమయ్యే వరకు కొత్తవారిని ఇప్పుడే విధుల్లోకి తీసుకోకూడదని, సర్వజనాస్పత్రిలో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు కృషి చేయాలని పద్మావతి ఏజెన్సీ మేనేజర్లు సాయితేజారెడ్డి, హరిలను ఆర్డీఓ కేశవనాయుడు ఆదేశించారు. ఆదివారం ఆర్డీఓ తన కార్యాలయంలో ఏజెన్సీ మేనేజర్లు, కార్మికులు, కార్మిక సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. రెండు నెలలుగా ఏజెన్సీ మేనేజర్లు నోటికొచ్చినట్టు మాట్లాడటమే కాకుండా అందరి ముందూ అవమానపరుస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎవ్వరూ తమ పట్ల ఇంత దురుసుగా వ్యవహరించలేదన్నారు. ఆర్డీఓ స్పందిస్తూ ఏజెన్సీ కాంట్రాక్టర్ తక్షణం తమను కలవాలని మేనేజర్లకు సూచించారు. సాధ్యమైనంత త్వరగా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు.
కొనసాగుతున్న ఉద్రిక్తత


