అరటి కష్టనష్టాలపై అధ్యయనం
అనంతపురం అగ్రికల్చర్: అరటి తోటలు ‘అనంత’ రైతుల్లో అలజడి రేపుతున్న తరుణంలో సమగ్ర అధ్యాయానికి తిరుపతి చీనీ, నిమ్మ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.శ్రీనివాసరెడ్డి బృందం ఇటీవల మూడు రోజుల పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించింది. ఉద్యానశాఖ జిల్లా అధికారులు డి.ఉమాదేవి, జి.చంద్రశేఖర్, దేవానంద్ తదితరులను వెంటబెట్టుకుని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, కళ్యాణదుర్గం, శెట్టూరు, బెళుగుప్ప, పుట్లూరు, యల్లనూరు, నార్పల, పెద్దపప్పూరు తదితర మండలాల్లో అరటి తోటలను పరిశీలించి రైతుల అనుభవాలు, మార్కెటింగ్ పరిస్థితులు తెలుసుకున్నారు. చాలా మంది రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం లేదని గుర్తించారు. అధిక దిగుబడుల కోసం మోతాదుకు మించి ఎరువులు వేయడం, విచ్చలవిడిగా పురుగు మందులు పిచికారీ చేస్తుండటం వల్ల పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతున్నట్లుగా నిర్ధారించారు.
ఫ్రూట్‌కేర్ యాక్టివిటీపై దృష్టి సారించాలి
మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, సిగటోక తెగులు వల్ల నాణ్యత లేనందున వ్యాపారులు ‘అనంత’ అరటిపై మొగ్గుచూపడం లేదని శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గత రెండు మూడేళ్లుగా అరటి సాగు పెరగడం, అక్కడ నాణ్యత బాగున్న కారణంగా ట్రేడర్లు అటువైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలిపారు. అక్కడి నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేయడానికి కూడా ‘అనంత’తో పోల్చుకుంటే ఖర్చు తక్కువగా ఉండటం కూడా కారణమన్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో ఫ్రూట్‌కేర్ యాక్టివిటీపై దృష్టి సారిస్తే... మున్ముందు మార్కెటింగ్ సమస్యను అధిగమించవచ్చన్నారు.
లోపాల గుర్తింపు
‘సాక్షి’తో డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. చాలా మంది రైతులు డ్రిప్ ద్వారా పురుగులు, తెగుళ్ల మందు వదులుతుండటం వల్ల సిగటోక తెగులు, మచ్చలు, కాయలపై చారలు లాంటివి తొలగడం లేదన్నారు. ఇది ఒక విధంగా నష్టాలకు కారణమవుతోందన్నారు. అరటిలో దిగుబడులు, నాణ్యతను తామర పురుగు దెబ్బతీస్తోందన్నారు. సిగటోక లక్షణాలు గుర్తించిన తర్వాత ప్రొపికొనజోల్ +మినరల్‌ఆయిల్, కార్బండిజమ్ + మాంకోజెబ్ + మినరల్ ఆయిల్, టిబుకొనజోల్ + ట్రైఫ్లాక్సోస్ట్రోబీన్ + మినరల్ ఆయిల్, ఆజాక్సీస్ట్రోబీన్ + టిబుకొనజోల్ + మినరల్ ఆయిల్, పైరాక్సోస్ట్రోబీన్ + ఏపినికోనజోల్ + మినరల్ ఆయిల్... ఈ ఐదు రకాల కాంబినేషన్ మందులు దశల వారీగా పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఎండ అధికంగా ఉన్నప్పుడు గెలలు వచ్చిన తర్వాత మినరల్ ఆయిల్ వాడకూడదన్నారు. ప్రతి పిచికారీ మధ్య 20 రోజుల విరామం ఉండాలన్నారు. గెలలకు పలుమార్లు పురుగుమందులు పిచికారీ చేయడం వల్ల ఖర్చు పెరగడమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఇది తగ్గించుకోవాలంటే పూమొగ్గ ఏర్పడే సమయంలో 0.3 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్‌ఎల్ 500 మి.లీ నీటిలో కలిపి సూది సహాయంతో ఒక్కో పూమొగ్గకు 1 మి.లీ మందు వేయాలన్నారు. చివరి హస్తాలు ఎదుగుదలకు 10 రోజుల ముందు మగ పుష్పగుచ్చాలు చెట్టు నుంచి తొలగించాలన్నారు. గెలలపై 5 గ్రాముల సల్ఫేట్ ఆఫ్ పొటాష్ (0–0–50) పిచికారీ చేయాలని, హస్తాలు పూర్తిగా విచ్చుకున్న తర్వాత గెలకు 17 జీఎస్‌ఎం మందం కలిగిన పాలిప్రోపిలిన్ నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ కవర్ తొడగాలని సూచించారు. గెలలు కోతకు వచ్చే 35 నుంచి 45 రోజుల ముందు ఎలాంటి మందులు పిచికారీ చేయకూడదన్నారు. పశువుల ఎరువు, వర్మీకంపోస్టు, పచ్చిరొట్ట ఎరువుల ద్వారా భూసారం పెంచుకుంటే రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల ఖర్చులు గణనీయంగా తగ్గిపోతాయని వివరించారు.
లోపాలు గుర్తించిన ‘తిరుపతి’ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త బి.శ్రీనివాసరెడ్డి
డ్రిప్ ద్వారా పురుగు మందులు ఇవ్వడం వల్ల సిగటోక తెగులు
పూమొగ్గకు ఇంజెక్షన్ ఇవ్వకపోవడంతో నాణ్యతపై ప్రభావం
మోతాదుకు మించిన పెట్టుబడులతో తగ్గిన లాభాలు


