జిల్లా అంతటా వర్షాలు
పుట్టపర్తి అర్బన్: మోంథా తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 28 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా పెనుకొండ 19.0 మి.మీ, అతి స్వల్పంగా అమడగూరు 1.0 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 137.2 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. వరి, మొక్కజొన్న, వేరుశనగ నూర్పిడి జరుతున్న నేపథ్యంలో తుపాను పట్టుకోవడంతో రైతులు ఉక్కిరిబికిరవుతన్నారు. పంటలసాగుకు దిక్కుతోచడం లేదు.
పట్టుగూళ్లపై తీవ్ర ప్రభావం
పెనుకొండ: మోంథా తుపాను ప్రభావం పెనుకొండ నియోజకవర్గంలో పట్టుగూళ్లపై తీవ్రంగా చూపింది. మంగళవారం ఉదయం నుంచే వర్షం మొదలైంది. పట్టుగూళ్లు మెత్తబడటం వల్ల కిలో రూ.650 ఉన్న ధర కాస్తా రూ.450కి పడిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రొద్దం మండలం బీదానిపల్లి, తురకలాపట్నం తదితర గ్రామాలతో పాటు పెనుకొండ మండలంలోని మహదేవపల్లి, సోమందేపల్లి, గోరంట్ల, పరిగి మండలాల పట్టు రైతులకు నష్టం వాటిల్లింది. అదేవిధంగా మొక్క జొన్న పంట కోసి విత్తనాన్ని కల్లాల్లో ఆరబోసిన రైతులు ఆందోళన చెందుతున్నారు.
వైవీఆర్‌కి వరద పోటు
ముదిగుబ్బ: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు యోగివేమన జలాశయం (వైవీఆర్)లోకి వరద పోటెత్తుతోంది. తహసీల్ధార్ నారాయణస్వామి, ప్రాజెక్ట్ జేఈ కృష్ణకుమార్, సీఐ శివరాముడు తదితరులు మంగళవారం గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు. ఈ సందర్భంగా డ్యాం దిగువ గ్రామాలైన నక్కలపల్లి, దొరిగిల్లు, ఇందుకూరు, మర్తాడు తదితర గ్రామాల ప్రజలను పోలీస్, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తం చేశారు.
మోంథాపై అప్రమత్తంగా ఉండాలి
ప్రశాంతి నిలయం: మోంథా తుపాన్ నేపథ్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యల నిమిత్తం సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు అందజేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. మంగళవారం ఉదయం కంట్రోల్ రూమ్‌ను జాయింట్ కలెక్టర్ మౌర్యా భరద్వాజ్‌తో కలసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంట్రోల్ రూం ల్యాండ్‌లైన్ బిజీగా ఉన్నప్పుడు విధుల్లో ఉన్న సిబ్బంది సెల్ నంబర్లు సంబంధిత శాఖలు, తహసీల్దార్ల అందరి వద్ద ఉండాలన్నారు. ఐఎండీ వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేయాలన్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, రెవెన్యూ, కంట్రోల్ రూమ్ సిబ్బంది పాల్గొన్నారు.


