
ఆశల వల.. నమ్మితే విలవిల
సాక్షి, పుట్టపర్తి ఖద్దరు వేస్తారు...ఖరీదైన కార్లలో తిరుగుతుంటారు. కలెక్టరేట్‌లో హడావుడిగా తిరుగుతూ కనిపించిన అధికారినంతా పలకరిస్తూ ఉంటారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని, ప్రభుత్వ పథకాలు మంజూరు చేయిస్తామని, తమ వ్యాపారంలో పెట్టుబడి పెడితే భారీగా వడ్డీ ఇస్తామంటూ వృద్ధులు, నిరుద్యోగులు, యువతపై వల విసురుతారు. అందినకాడికి దోచుకుని పత్తాలేకుండా పోతారు. జిల్లాలో ఈ తరహా మోసాలు ఇటీవల ఎక్కువయ్యాయి.
పేర్లు మార్చి.. వేషం ధరించి
ఈజీ మనీకి అలవాటు పడిన కేటుగాళ్లు వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ.. అక్కడి ప్రజలకు ఏం అవసరమో గ్రహించి.. వెంటనే కొత్త అవతారం ఎత్తుతారు. ఉన్నఫలంగా కొత్త శైలిలో పరిచయం అవుతూ.. కొంత డబ్బులు ఖర్చు చేస్తూ ఇల్లు తీసుకుంటారు. టీ స్టాల్, హోటల్స్ దగ్గర ప్రజలతో మమేకం అవుతారు. ‘‘తాను ఫలానా’’ అని నమ్మబలికి అవసరమైతే అవతలి వారికి అప్పుగా కొంత మొత్తం కూడా ఇస్తారు. ఒకరి ద్వారా మరికొందరిని పరిచయం చేసుకుంటారు. నెల రోజుల పాటు అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ.. ఆ తర్వాత ఒకరికి తెలియకుండా.. మరొకరితో డబ్బులు తీసుకుని ఉన్నఫలంగా ఫోన్ ఆఫ్ చేసుకుని పరారీ అవుతున్నారు. ఆ తర్వాత మారుపేర్లతో వేషం మార్చి మరో ప్రాంతానికి మకాం మారుస్తారు.
‘ఆశ’ల వలకు చిక్కి
కొందరు తానో పెద్ద కంపెనీకి యజమానినని, లేదా ఆ కంపెనీ యజమానితో తనకు బాగా పరిచయం ఉందని బిల్డప్ ఇస్తారు. నేరుగా నిరుద్యోగి ఇంటికే వెళ్లి ఉద్యోగం ఇప్పిస్తామంటూ వల విసురుతారు. దీంతో చాలా మంది ఇంటికి వచ్చిన వాడికి అంతో ఇంతో ఇస్తే సరిపోతుందని టక్కున డబ్బులు చెల్లిస్తున్నారు. ఇక ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఇదే సరైన సమయం అంటూ నమ్మిస్తే పడిపోతున్నారు. స్టాక్ మార్కెట్.. సరుకు నిల్వ అనగానే.. ఎక్కడికి పోతాడులే.. రూం కూడా అద్దెకు తీసుకున్నాడని నమ్మి మోసపోతున్నారు. అధిక వడ్డీ అనగానే.. ఆశపడి రూ.లక్షల్లో చెల్లిస్తున్నారు. మాటలు నేర్చిన మాంత్రికులు ఇలాంటి కేటగిరీ ప్రజలను లక్ష్యంగా చేసుకుని నిత్యం మోసాలకు పాల్పడుతున్నారు. తాము మోసపోయామని తెలుసుకున్న తర్వాతే బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోలీసులు నిందితుడిని అదుపులో తీసుకున్నా రికవరీ సాధ్యం కావడం లేదు. అందుకే ఇలా మాయమాటలు చెప్పే కేటుగాళ్లు బారిన పడవద్దని, ఎవరైనా ఏదైనా చెబితే ఒకటికి పదిసార్లు ఆలోచించి డబ్బులు ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.
అమాయకులను
టార్గెట్ చేసిన ఫేక్ కాలర్లు
ఉద్యోగాలు, అధిక వడ్డీ, పథకాల మంజూరు పేరుతో భారీగా దోపిడీ
రూ.కోట్లలో వసూలు చేసుకుని పరారీ
రోజుకో చోట వెలుగులోకి వరుస ఘటనలు