
రాత్రి వేళల్లో అత్యవసర సేవలు బంద్
పెనుకొండ రూరల్: పీహెచ్‌సీల వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో రాత్రి వేళ అత్యవసర వైద్య సేవలు అందడం లేదు. 44వ జాతీయ రహదారి పక్కనే పెనుకొండ పీహెచ్‌సీ కేంద్రం ఉంటుంది. ఈ రహదారిపై నిత్యం రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక్కడ అత్యవసర వైద్యం అందక పోతే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇంతటి కీలకమైన ప్రాంతంలోని పీహెచ్‌సీలో వైద్యులు అందుబాటులో లేకుండా పోయారు. ఇక్కడ పనిచేస్తున్న ఇద్దరు డాక్టర్లు సమ్మెలోకి వెళ్లగా... పీహెచ్‌సీ ఇన్‌చార్జ్‌గా అధికారులు అనే మరో వైద్యుడిని నియమించారు. ఆయన పగటి వేళ అనంతపురం నుంచి వచ్చివెళ్తున్నారు. దీంతో రాత్రి వేళల్లో అత్యవసర సేవలకు ఇబ్బందికరంగా మారింది. ఏదైనా యాక్సిడెంట్ కేసు వస్తే నర్సు, వాచ్‌మెన్ వైద్యుల అవతారం ఎత్తాల్సిన దుస్థితి నెలకొంది. లేదంటే 8 కిలో మీటర్లు ప్రయాణించి పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకోవాల్సి వస్తుంది. ఇక చాలా పీహెచ్‌సీల్లో నర్సులే వైద్యసేవలందిస్తున్నారు. చాలా కేసులను హిందూపురం, అనంతపురం రెఫర్ చేస్తున్నారు. దీంతో ఆయా ఆస్పత్రుల్లో ఓపీ భారీగా పెరిగిపోయింది.