
అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి
ప్రశాంతి నిలయం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడుతున్న నేపథ్యంలో జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అందువల్ల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. వర్షాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలను అప్రమత్తం చేసి నష్టాన్ని నివారించాలన్నారు. ప్రజలు కూడా ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్నారు. వర్షాలు కురుస్తున్న సమయంలో చెట్లు, భారీ హోర్డింగ్‌ల కింద, పాడైపోయిన పాత భవనాలు, పాడుబడిన పాఠశాలల్లో ఉండరాదన్నారు. ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. వాగులు, వంకలు పొంగి పొర్లితే ఇరిగేషన్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. రోడ్లు, కల్వర్టులు, చెరువులు తెగిపోయే అవకాశం ఉంటే... ఆయా శాఖల అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లకుండా మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల ప్రభావం తగ్గే వరకూ ప్రతి మండలానికి ప్రత్యేక అధికారిని నియమించి వారి ద్వారా పరిస్థితిని పర్యవేక్షించాలని డీఆర్‌ఓను ఆదేశించారు.
కంట్రోల్ రూం ఏర్పాటు
వర్షాల వల్ల ఏవైనా ఇబ్బందులు కలిగితే వెంటనే తగు చర్యలు తీసుకునేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అత్యవసర సమయంలో ప్రజలు 08555289039 నంబర్‌కు ఫోన్ చేసి సాయం పొందవచ్చన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
వర్షాలతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి
అత్యవసర సాయం కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు
అధికారులతో కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్