
బినామీల కోసమే ప్రైవేటీకరణ
సోమందేపల్లి: సీఎం చంద్రబాబు తన బినామీలకు లబ్ధి చేకూర్చడానికే వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు సిద్ధమయ్యారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ విమర్శించారు. ఆదివారం ఆమె మండలంలోని పందిపర్తి గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. పేదల వైద్యానికి భరోసా కల్పించడంతో పాటు పేద విద్యార్థులు కూడా వైద్యవిద్య అభ్యసించాలన్న సదుద్దేశంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో భారీసంఖ్యలో ప్రభుత్వ వైద్యకళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత సీఎం చంద్రబాబు వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. పెనుకొండ వైద్య కళాశాలను పూర్తి చేస్తే ఈ ప్రాంతానికంతా మేలు జరుగుతుందని, ఆ దిశగా చొరవ చూపడంలో మంత్రి సవిత విఫలమయ్యారని విమర్శించారు. పైగా ఈ వైద్యకళాశాల నిర్మాణం విషయంలో ఇటీవల తప్పుడు ప్రచారం చేసి ఆభాసుపాలు అయ్యారని గుర్తు చేశారు. సూపర్‌సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు అశోక్, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు గజేంద్ర, శ్రీనివాసులు, మాజీ కన్వీనర్లు వెంకటరత్నం, నారాయణ రెడ్డి, సర్పంచులు కిష్టప్ప, జిలాన్, రామాంజి, సోము, వైస్ సర్పంచ్ వేణు, వైస్ ఎంపీపీ వెంకట నారాయణ రెడ్డి, స్థానిక నాయకులు సదాశివ రెడ్డి, రవీంద్ర రెడ్డి, రాజశేఖర్ , బాబు, నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు తీరుతో పేద విద్యార్థులకు అన్యాయం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్