చితికిన చెనిక్కాయ | - | Sakshi
Sakshi News home page

చితికిన చెనిక్కాయ

Oct 20 2025 9:28 AM | Updated on Oct 20 2025 9:28 AM

చితికిన చెనిక్కాయ

చితికిన చెనిక్కాయ

జిల్లా రైతులతో దశాబ్దాలుగా పెనవేసుకుని ప్రధానపంటగా వెలుగొందుతున్న వేరుశనగ ప్రాభవం కోల్పోతోంది. గత పదేళ్లుగా క్రమంగా తగ్గుతూ వచ్చిన పంట విస్తీర్ణం ఈ ఖరీఫ్‌లో మరింత పతనమైంది. జిల్లా చరిత్రను తిరగేస్తే 1960 దశకం తర్వాత ఇదే అత్యల్ప విస్తీర్ణం కావడం గమనార్హం.

అనంతపురం అగ్రికల్చర్‌: పెరిగిన పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులు, గిట్టుబాటు ధరలు లభించకపోవడం, కూలీల సమస్య, చీడపీడల వ్యాప్తి, అడవిపందులు, జింకల బెడద, పంట నష్ట ఉపశమనం (స్కేల్‌ ఆఫ్‌ రిలీఫ్‌) తక్కువగా ఉండటం, అందులోనూ గరిష్టంగా రెండు హెక్టార్లకే ఇన్‌పుట్‌ ఇస్తుండటం, పంటల బీమా కింద పెద్దగా పరిహారం రాకపోవడం ఇలా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్న చందంగా క్రమంగా వేరుశనగ తన ప్రాశస్త్యాన్ని కోల్పోతూ వస్తోంది. ఒకానొక దశలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేరుశనగ సాగు విస్తీర్ణం 8 లక్షల నుంచి 9 లక్షల హెక్టార్ల గరిష్టస్థాయికి చేరుకుంది. జిల్లాలో ఎటు చూసినా వేరుశనగ మినహా మరో పంట కనిపించే పరిస్థితి లేకుండా శాసించింది. అక్కడక్కడా ఇతరత్రా పంటలు ఉన్నా వేరుశనగ మధ్యలో అంతర పంటలుగా మాత్రమే సాగవుతూ వచ్చాయి. అలా వేరుశనగ ఏకపంటగా విస్తరించి జిల్లాను పూర్తిగా ఆక్రమించింది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒక జిల్లాలో ఈ స్థాయిలో వేరుశనగ పంట పండించడం లేదని చెప్పేవారు. ఇలా 1960 దశకం నుంచి మొదలైన వేరుశనగ ప్రాభవం లక్షలాది హెక్టార్లతో 2015 వరకు అప్రతిహతంగా కొనసాగింది. అలాంటి పంట విస్తీర్ణం అనంతపురం జిల్లాలో ఈ ఖరీఫ్‌లో రెండో స్థానానికి దిగజారిపోయింది.

గత 30 ఏళ్లలో నాలుగుసార్లు గిట్టుబాటు..

అధికారిక లెక్కల ప్రకారం గత 30 ఏళ్లలో కేవలం నాలుగు సంవత్సరాల్లో వేరుశనగ మంచి దిగుబడులు రావడంతో గిట్టుబాటు అయింది. మరో ఏడేళ్లు పెట్టుబడులు దక్కించుకోగా తక్కిన 19 సంవత్సరాలు రైతులకు నష్టాలు మిగి ల్చింది. సగటున ఎకరాకు 10 బస్తాలు లేదా హెక్టారుకు వేయి కిలోల వరకు వేరుశనగ దిగుబడులు వస్తేనే పంట బాగా వచ్చినట్లు లెక్క. 1995 నుంచి 2024 వరకు వేరుశనగ పంట దిగుబడులు పరిగణిస్తే అందులో 1995లో మాత్రం వేరుశనగ పంట బాగా పండింది. 1995లో హెక్టారుకు సగటున 1,310 కిలోల దిగుబడులు వచ్చాయి. ఆ తరువాత 1998లో 1,145 కిలోలు, 2000లో 1,116 కిలోలు, 2007లో 1,259 కిలోల దిగుబడులు వచ్చాయి. ఈ నాలుగేళ్లు పంట చేతికివచ్చింది. ఇక ఏడు సార్లు హెక్టారుకు 500 కిలోల నుంచి 950 కిలోల మధ్య రావడంతో పంటకు పెట్టిన పెట్టుబడులు దక్కాయి. ఇక తక్కిన 19 సార్లు వేరుశనగ దారుణంగా దెబ్బతిన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2006లో కేవలం 67 కిలోలు, 2008లో 88 కిలోలు... ఇలా 100 కిలోల లోపే దిగుబడులు రావడంతో ఎకరాకు అర బస్తా కూడా పండిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో వేరుశనగ సమస్య పరిష్కారానికి 2012లో భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్‌) అప్పటి డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ అయ్యప్పన్‌ నేతృత్వంలోని దేశవ్యాప్తంగా 18 మంది నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ కూడా జిల్లాలో పర్యటించి వేరుశనగ సాగును తగ్గించి చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, గోరుచిక్కుడు లాంటి పంటలు వేయాలని సిఫారసు చేసింది.

కంది టాప్‌..

ఈ ఖరీఫ్‌లో కంది పంట చరిత్ర సృష్టిస్తూ సాగులో మొదటి స్థానంలో నిలిచింది. అనంతపురం జిల్లాలో 55,296 హెక్టార్లుగా అంచనా వేయగా రెండింతలు అధికంగా 1.05 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి రావడం గమనార్హం. కందితో పాటు ఆముదం, మొక్కజొన్న పంటల సాగు బాగా పెరుగుతూ వేరుశనగను వెనక్కినెట్టేస్తున్నాయి. ఈ ఖరీఫ్‌లో అన్ని పంటలు 3,43,232 హెక్టార్లలో సాగులోకి రావచ్చని అంచనా వేయగా... అననుకూల వర్షాల కారణంగా 88 శాతంతో 3.02 లక్షల హెక్టార్లకు చేరుకున్నాయి. అందులో కంది 1.04 లక్షల హెక్టార్లు, వేరుశనగ 91 వేల హెక్టార్లు, పత్తి 26 వేల హెక్టార్లు, మొక్కజొన్న 29 వేల హెక్టార్లు, ఆముదం 16 వేల హెక్టార్లు... ఈ ఐదు పంటలే 80 శాతం ఆక్రమించాయి. నీటి వసతి కింద 25 వేల హెక్టార్లలో వరి సాగులోకి వచ్చింది. ఇక సజ్జ, కొర్ర సాగు కొంచెం మెరుగ్గానే ఉన్నా... రాగి, జొన్న, పెసర, అలసంద, మినుము, సోయాబీన్‌, పొద్దుతిరుగుడు, నువ్వులు తదితర పంటలు నామమాత్రంగా సాగులోకి వచ్చాయి.

65 ఏళ్ల జిల్లా చరిత్రలో కనిష్ట సాగు

లక్ష లోపు హెక్టార్లకు పరిమితమైన ప్రధానపంట

నష్టాలతో సాగుపై రైతుల అనాసక్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement