
కావాల్సింది కొండంత.. సరఫరా గోరంత
మడకశిర: యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. అదనులో ఎరువు వేయకపోతే పంట దక్కే పరిస్థితి లేకపోవడంతో రైతులు యూరియా కోసం పీఏసీఎస్‌ల ఎదుట బారులు తీరుతున్నారు. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దున ఉన్న మడకశిర నియోజకవర్గంలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. మంగళవారం మడకశిర పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ) 150 బస్తాల యూరియా సరఫరా కాగా, వందలాది మంది రైతులు తరలి వచ్చారు. క్యూలో నిలబడి గంటల తరబడి బారులు తీరగా.. అధికారులు తొలుత రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. ఆ తర్వాత స్టాకు తక్కువగా ఉండటంతో రైతుకు బస్తా చొప్పున పంపిణీ చేయాల్సి వచ్చింది. అయినా కూడా చాలా మంది రైతులకు యూరియా అందకపోవడంతో వారంతా సర్కారు తీరుపై మండిపడ్డారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. డిమాండ్ మేరకు యూరియాను కూడా అందించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.
కర్ణాటకలో కొనుగోలు
డిమాండ్ మేరకు సర్కారు యూరియాను అందించకపోవడంతో నియోజకవర్గంలోని పలువురు రైతులు కర్ణాటకలోని ధర్మపురం, మంగళవాడ, బరగూరు, శిర, మదలూరు, మిడిగేశి, పావగడ తదితర ప్రాంతాలకు వెళ్లి యూరియాను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లు గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాల్లోనే యూరియా, కాంప్లెక్స్, డీఏపీ తదితర ఎరువులు, విత్తనాలు అందేవని, ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు.
యూరియా కోసం
రైతులకు తప్పని అగచాట్లు
పీఏసీఎస్ ఎదుట బారులు తీరిన వైనం
కూటమి సర్కారు తీరుపై తీవ్ర అసంతృప్తి

కావాల్సింది కొండంత.. సరఫరా గోరంత