
జిల్లాకు వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల ఐదు రోజులూ ఉమ్మడి అనంతపురం జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు వారు మంగళవారం బులెటిన్ విడుదల చేశారు. ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు మోస్తరు వర్షం కురిసే సూచన ఉందన్నారు. 10న ఒక మి.మీ, 11న 15 మి.మీ, 12న 8 మి.మీ, 13న 15 మి.మీ, 14న 13 మి.మీ మేర సగటు వర్షపాతం నమోదు కావొచ్చన్నారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 33.7 డిగ్రీల నుంచి 34.1 డిగ్రీల మధ్య నమోదు కావొచ్చన్నారు. పశ్చిమ దిశగా గంటకు 13 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
నేడు పాఠశాలలకు సెలవు
● రెండో శనివారం 13న పాఠశాలలు పనిచేయాలంటూ ఆదేశం
● ప్రభుత్వ నిర్ణయంపై
ఉపాధ్యాయుల తీవ్ర ఆగ్రహం
పుట్టపర్తి అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో బుధవారం జిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు పాల్గొనే ‘సూపర్ సిక్స్–సూపర్ హిట్’ కార్యక్రమానికి పాఠశాలల బస్సులు తరలించిన నేపథ్యంలో ప్రైవేటుతో పాటు ప్రభుత్వ పాఠశాలలకూ సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. నేటి సెలవుకు బదులుగా రెండో శనివారం (ఈనెల 13న) అన్ని యాజమన్యాల పాఠశాలలు పని చేయాల్సి ఉంటుందని డీఈఓ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇచ్చిన సెలవుకు రెండో శనివారం పని చేయించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయులు రెండో శనివారం, ఆదివారం రెండు రోజులు సెలవలు వస్తాయని ముందుగానే వారి ప్రోగ్రాంలు నిర్ణయించుకుని, ప్రయాణాలకు టికెట్లు రిజర్వేషన్లు చేయించుకొని సిద్ధంగా ఉంటారన్నారు. అలాంటి ఉన్నట్టుండి శనివారం పనిదినంగా ప్రకటించడంపై ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రచారం కోసం సభ ఏర్పాటు చేస్తే ప్రయాణ భద్రత రీత్యా పాఠశాలలకు సెలవు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సెలవుకు పరిహారంగా మరో రోజును ప్రకటించాలని, రెండో శనివారం కచ్చితంగా సెలవు మంజూరు చేయాలని పలువురు ఉపాధ్యాయులు కోరుతున్నారు.
మాతాశిశు మరణాలను
తగ్గించాలి : డీఎంహెచ్‌ఓ
హిందూపురం టౌన్: మాతాశిశు మరణాల శాతాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని వైద్యాధికారులకు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజా బేగం సూచించారు. మంగళవారం హిందూపురంలోని జిల్లా ఆస్పత్రిలో హిందూపురం ప్రాంత వైద్యాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రాథమిక, అర్బన్ హెల్త్ సెంటర్లలో ఓపీ, ఐపీలను పెంచాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. హెల్త్ సెంటర్లలో కుక్క కాటుకు, పాము కాటుకు టీకాలను అందుబాటులో ఉండాలన్నారు. గర్భిణులు, బాలింతలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని ఆమె ఆదేశించారు.

జిల్లాకు వర్షసూచన