
ప్రాణహాని ఉంది.. కాపాడండి
● భార్య, ఆమె ప్రియుడిపై
బాధితుడి ఫిర్యాదు
● రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అప్పగించినా స్పందించని పోలీసులు
● భార్య ఫిర్యాదు చేస్తే గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేస్తామంటూ
బెదిరింపులు
● న్యాయం చేయాలంటూ వేడుకుంటున్న బాధితుడు
హిందూపురం: తన భార్య, ఆమె ప్రియుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఓ భర్త వాపోయాడు. ఈ విషయంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని, పైగా భార్య ఫిర్యాదు చేస్తే గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసి, జైలుకు పంపిస్తామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. బుధవారం ‘సాక్షి’తో బాధితుడు మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీలో నివాసముంటున్న రామకృష్ణ.. ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానన్నారు. ఈ క్రమంలో తాను విధులకు వెళ్లగానే తన భార్య.. ప్రియుడిని రప్పించుకోవడం పరిపాటిగా మారిందన్నారు. ఈ విషయంపై పలుమార్లు ఆమెకు నచ్చచెప్పినా ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. గత శనివారం మరో డ్రైవర్ తనను రిలీవ్ చేయడంతో రాత్రి 9.30 గంటలకు ఇంటికి చేరుకున్నానన్నారు. అప్పటికే ఇంట్లో తన భార్య, ఆమె ప్రియుడు శ్రీకాంత్ ఏకాంతంగా ఉండడం గమనించి, బంధువుల సాయంతో వారిని అదే రోజు రాత్రి 1 గంటల సమయంలో వన్‌టౌన్ పీఎస్‌కు పిలుచుకెళ్లి ఫిర్యాదు చేశానన్నారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న పోలీసులు ఉదయాన్నే రావాలని తెలపడంతో తన భార్య, ఆమె ప్రియుడిపై రాత పూర్వకంగా ఫిర్యాదు చేసి ఇంటికి చేరుకున్నామన్నారు. మరుసటి రోజు ఉదయాన్నే పోలీసు స్టేషన్‌కు వెళితే.. కేసు నమోదు చేసి, తన సంసారాన్ని నిలబెట్టాల్సిన పోలీసులు ఇందుకు విరుద్ధంగా మాట్లాడారని వాపోయాడు. తనకు వ్యతిరేకంగా భార్య ఫిర్యాదు చేస్తే గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసి, జైలుకు పంపాల్సి వస్తుందని, చట్టాలు మహిళలకే వర్తిస్తాయని బెదిరింపులకు దిగారన్నారు. మహిళలు తప్పు చేసినా.. చట్టాలు వారిపై మొగ్గుచూపుతున్నాయని నచ్చచెప్పే ప్రయత్నం చేశారన్నారు. తన భార్య, ఆమె ప్రియుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని మొరపెట్టుకున్నా పోలీసులు ఏకపక్షంగా తనపై కేసు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని వాపోయాడు. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.
యువతి అదృశ్యం
కదిరి టౌన్: స్థానిక గొల్లమ్మ మంటపం వద్ద నివాసముంటున్న బాల రాధమ్మ కుమారై బి.మౌనిక బుధవారం ఉదయం నుంచి కనిపించడం లేదు. తల్లి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. ఉదయం దుకాణానికి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వచ్చిన యువతి.. తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబసభ్యులు గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవళం బజారులో నివాసముంటున్న లక్ష్మీనారాయణ కుమారుడు రెడ్డప్పతో తన కుమార్తె చనువుగా ఉండేదని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.
యువతి అదృశ్యంపై కేసు నమోదు
కదిరి పట్టణంలోని అడపాల వీధికి చెందిన యువతి అదృశ్యంపై కేసు నమోదు చేనట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో నర్సింగ్ చేస్తున్న అడపాల వీధికి చెందిన లింగాల ఈశ్వరయ్య కుమార్తె నవ్య రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చింది. మంగళవారం ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో యువతి తల్లి పద్మావతి ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టారు.
రైతు బలవన్మరణం
చెన్నేకొత్తపల్లి: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు.. సీకేపల్లి మండలం నామాల గ్రాఆమనికి చెందిన రామ్మూర్తి (38)కి భార్య అంజలి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తనకున్న మూడెకరాల పొలంలో అప్పులు చేసి 4 బోరు బావులు వేసి పంటలు సాగుతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో పంటల సాగు చేసిన అప్పులకు వడ్డీల భారం పెరిగి రూ.15 లక్షలకు చేరుకున్నాయి. అప్పులు తీర్చాలంటూ వడ్డీ వ్యాపారుల నుంచి ఒత్తిళ్లు తీవ్రం కావడంతో మనస్తాపం చెందిన రామ్మూర్తి రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. ఆలస్యంగా ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న రామ్మూర్తిని వెంటనే అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సిఫారసు మేరకు కర్నూలుకు తరలించారు. చికిత్స స్పందించక బుధవారం సాయంత్రం ఆయన మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
తలుపుల: మండలంలోని గాంధీనగర్‌లో నివాసమంటున్న ఎన్.వెంకటరమణ (42) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాది క్రితం తన పెద్దకుమారుడు అనారోగ్యానికి గురి కావడంతో బంగారునగలు తాకట్టు పెట్టి చూపించాడు. అనంతరం తల్లి చనిపోయింది. ఈ క్రమంలో అప్పులు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురైన ఆయన బుధవారం ఊజీ గుళికలు మింగి విషయాన్ని భార్యకు తెలిపాడు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే కదిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. భార్య రత్నమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రాణహాని ఉంది.. కాపాడండి