
సంతకాల కోసమే పనికొస్తామా?
ధర్మవరం రూరల్: కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఇప్పటి వరకూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు చెల్లించడం లేదని, పంచాయతీల అభివృద్ధికి సైతం నిధులను మంజూరు చేయకుండా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారంటూ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ధ్వజమెత్తారు. బుధవారం ధర్మవరం మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన ఎంపీటీసీలు, సర్పంచ్‌లు మండల సర్వసభ్య సమావేశాన్ని గంట పాటు బహిష్కరించి ఎంపీడీఓ సాయిమనోహర్, డిప్యూటీ ఎంపీడీఓ వెంకటేష్‌ను చుట్టుముట్టి ఘోరావ్ చేశారు. ప్రభుత్వం నిధులు కేటాయించకపోతే పంచాయతీల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. గ్రామాలలో తాగునీరు, వీధిలైట్లు, రహదారుల నిర్మాణాలు తదితర మౌలిక వసతుల కోసం నిధులు అడిగితే పైసా కూడా లేదని అధికారులు చెపుతున్నారంటూ సర్పంచ్‌లు మండి పడ్డారు. కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లిందేకు కూడా నిధులు మంజూరు చేయకుంటే ఎలా నిలదీశారు. గ్రామాలలో ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక సర్పంచ్‌లు, ఎంపీటీసీలను ఆహ్వానించకుండా పార్టీ నాయకులను అందలం ఎక్కిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదన్నారు. 22 నెలలుగా ఎంపీటీసీలకు గౌరవ వేతనాలు చెల్లించకుండా సహనాన్ని పరీక్షిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కుబడిగా జరిగే మండల సర్వ సభ్య సమావేశాలకు ఆహ్వానించి రిజిస్టర్‌లో సంతకాలు చేయించుకుంటున్నారని, బయటి కార్యక్రమాల్లో తమకు ఎలాంటి గౌరవం ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. గ్రామాలలో సర్పంచ్‌ల తీర్మానాలు లేకుండానే ఉపాధి హామీ పథకం పనులు చేయిస్తున్నారన్నారు. దీంతో స్పందించిన ఎంపీడీఓ.. త్వరలోనే ప్రజాప్రతినిధులకు వేతనాలు చెల్లించడం జరుగుతుందని, ప్రభుత్వ కార్యక్రమాలకు గ్రామాలలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు ప్రాధాన్యతను ఇస్తామని భరోసానివ్వడంతో ఆందోళనను విరమించారు.
గౌరవం లేదు.. గౌరవ వేతనమూ లేదు
22 నెలలుగా ఎంపీటీసీలకు
అందని వేతనం
అధికారులను నిలదీసిన
ఎంపీటీసీలు, సర్పంచ్‌లు