
గూగూడులో ‘హుండీ మాయం’!
నార్పల: మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గూగూడులో హుండీ మాయమైన ఘటన కలకలం రేపింది. గూగూడు కుళ్లాయిస్వామి మొహర్రం ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో తాత్కాలికంగా నాలుగు హుండీలు ఏర్పాటు చేశారు. వాటిలో మూడింటిని ఈ నెల 18న తెరిచి కానుకలను లెక్కించారు. తర్వాత ఆ హుండీలను ఓ ట్రాక్టర్‌లో తీసుకెళ్లారు. ఈ క్రమంలో లెక్కించని నాలుగో హుండీని కూడా తరలించినట్లు తెలిసింది. గూగూడు గ్రామస్తుల నుంచి కూడా దీనిపై ఆరోపణలు వచ్చాయి. ఇదే క్రమంలో ట్రాక్టర్‌లో హుండీలను తరలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
ఈఓకు టీడీపీ నాయకుల వత్తాసు..
‘హుండీ మాయం’ ఘటనపై బుధవారం దేవదాయ శాఖ ఈఓ శోభారాణి గూగూడులో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకర్లు సీసీ కెమెరా ఫుటేజీ చూపాలని, దీంతో అనుమానాలన్నీ తొలగిపోతాయని ఈఓను కోరగా.. పొంతనలేని సమాధానాలిచ్చారు. ఈ క్రమంలోనే ఆమె వెంటే ఉన్న టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. విలేకర్లపై దురుసుగా ప్రవర్తించారు. ఈఓకు టీడీపీ నేతలు వత్తాసు పలకడం సర్వత్రా అనుమానాలకు తావిచ్చింది. టీడీపీ నేతలను ఎందుకు వెంట తెచ్చుకున్నారని ఈఓను ప్రశ్నిస్తే.. వారు అనధికారిక కమిటీ మెంబర్లంటూ ఆమె సమాధానం చెప్పడం గమనార్హం. ఏదిఏమైనా రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన గూగూడు ఆలయంలో హుండీ మాయమైన ఘటన గ్రామస్తులు, భక్తులకు ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సీసీ ఫుటేజీని బయటకు తీయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
భక్తులు, గ్రామస్తుల ఆందోళన
సీసీ ఫుటేజీ చూపాలని కోరితే
ఈఓ పొంతనలేని సమాధానం
ఆమెకు టీడీపీ నాయకుల వత్తాసు
పలకడంపై సర్వత్రా అనుమానాలు