
సామాజిక బాధ్యతతో మెలగాలి
పుట్టపర్తి టౌన్: ప్రయాణికులను గమ్య స్థానానికి చేర్చడమే కాకుండా వారి పట్ల సామాజిక బాధ్యతతో మెలగాలని ఆటో డ్రైవర్లకు ఎస్పీ రత్న సూచించారు. ఆటో డ్రైవర్లకు భద్రత– బాధ్యత అనే అంశంపై బుధవారం సాయి ఆరామంలో అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి ఎస్పీ రత్న, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజాబేగం ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. సత్యసాయి శతజయంతి వేడుకలకు దేశవిదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, వారిని రవాణా చేయడంలో ఆటో డ్రైవర్ల పాత్ర కీలకమన్నారు. ఇలాంటి తరుణంలో ఆటోలు నడిపే సమయంలో తమ కుటుంబాలతో పాటు ప్రయాణికుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. చిన్నారులతో, విద్యార్థులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రతి ఆటోకూ వెహికల్ ట్రాఫికింగ్ సిస్టమ్ తప్పనిసరిగా అమర్చుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం రెండు, మూడు భాషలపై పట్టు కలిగి ఉండాలన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అడ్డుకోవడంలో ఆటోడ్రైవర్లు కీలక పాత్ర పోషించాలన్నారు. అసాంఘిక శక్తుల సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంలో ఆటో డ్రైవర్లు ముందుండాలన్నారు. ఎంవీఐ వరప్రసాద్ మాట్లాడుతూ.. ప్రమాదాలు జరిగిన వెంటనే ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించే వారికి ప్రభుత్వాలు అందజేసే పారితోషకంపై అవగాహన కల్పించారు. డాక్టర్ ఫైరోజాబేగం మాట్లాడుతూ.. గుట్కా, పాన్‌పరాగ్, గుట్కా, మద్యం వంటి వాటి వల్ల ప్రాణాంతకమైన జబ్బులబారిన పడే ప్రమాదముందని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్పీ విజయకుమార్, పుట్టపర్తి నల్లమాడ, పుట్టపర్తి సీఐలు సునీత, నరేంద్రరెడ్డి, సురేష్, మారుతీశంకర్, ఎస్‌ఐలు మల్లికార్జునరెడ్డి, కృష్ణమూర్తి, వైద్య సిబ్బంది, 800మంది ఆటో కార్మికులు పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్లకు ఎస్పీ రత్న సూచన