
‘సూపర్’కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి
● మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్
అనంతపురం మెడికల్: ఉమ్మడి జిల్లా ప్రజలకు వైద్య సేవలు మరింత మెరుగుపరిచేలా అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనను మానుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, ప్రజారోగ్య వేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొండయ్య డిమాండ్ చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాంటూ ఆస్పత్రి ఎదుట ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆస్పత్రుల అభివృద్ధిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సత్యకుమార్ ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో నిర్వహించడం సబబు కాదన్నారు. ఆరోగ్యాన్ని హక్కుగా ప్రకటించాలన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉన్న 8 స్పెషాలిటీ వైద్య సేవలను విస్తృతం చేసేలా వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపట్టాలన్నారు. క్రిటికల్ కేర్ యూనిట్‌ను త్వరితగతిన ప్రారంభించాలన్నారు. న్యూరో, కార్డియో, తదితర కేసులను నేరుగా ఇక్కడే అడ్మిట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించాలన్నారు. అనంతరం డిమాండ్లపై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ప్రజారోగ్యవేదిక జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ప్రసూన, డాక్టర్ వీరభద్రయ్య, ఏజీ రాజమోహన్, సీఐటీయూ, రైతు సంఘం, ఏపీఎంఎస్‌ఆర్‌యూ, పెన్షనర్స్ అసోసియేషన్, హ్యూమన్ రైట్స్ ఫోరం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
జూదరుల అరెస్ట్
తలుపుల: మండలంలోని ఎనమలదొడ్డివారిపల్లి సమీపంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ నరసింహుడు తెలిపారు. జూదరుల నుంచి రూ.25,070 నగదు, ఐదు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు.