
జగతి మెచ్చేలా జయంత్యుత్సవం
ప్రశాంతి నిలయం: సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాన్ని జగతి మెచ్చేలా చేద్దామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్ టీఎస్ చేతన్‌తో కలిసి సత్యసాయి శత జయంత్యుత్సవాల ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సత్యసాయి శత జయంత్యుత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏర్పాట్లన్నీ అక్టోబర్ 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. జయంత్యుత్సవాలు ప్రారంభమయ్యాక మామూలు రోజుల్లో రోజూ 10 వేల మంది, ముఖ్యమైన రోజుల్లో 60 వేల నుంచి 70 వేల మంది పాల్గొనే అవకాశం ఉందన్నారు. భక్తుల రాకకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, చైన్నె వంటి మహానగరాల నుంచి కూడా భక్తులు తరలివస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీరు, పారిశుధ్యం, మొబైల్ టాయిలెట్లు, వీధి దీపాలు వంటి ప్రాథమిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. జయంత్యుత్సవాలకు విచ్చేసే భక్తులకు ఇబ్బంది కలగకుండా బెంగళూరు–పుట్టపర్తి రోడ్డు మార్గాన్ని మరమ్మతులు చేయాలన్నారు. కొత్తచెరువు – పెనుకొండ, బ్రాహ్మణపల్లి – ఎనుములపల్లి మార్గాలను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలన్నారు. ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ ఉండేలా ఇంటర్నల్ రింగ్‌రోడ్లు అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌తో పాటు పార్కింగ్‌కు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
అన్ని చర్యలు తీసుకుంటున్నాం
కలెక్టర్ టీఎస్ చేతన్ మాట్లాడుతూ, సత్యసాయి శత జయంత్యుత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే అధికారులకు సూచనలు జారీ చేశామన్నారు. ట్రాఫిక్, మౌలిక సదుపాయాల కల్పన, సెక్యూరిటీ ప్లానింగ్‌కు సంబంధించి అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. ఎస్పీ వి.రత్న మాట్లాడుతూ, భద్రత పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అత్యవసర వాహనాలతో పాటు, సీసీటీవీ కెమెరాలు ఏర్పాట్లు చేస్తామన్నారు. కమ్యూనికేషన్ కోసం రిపీటర్ స్టేషన్, పార్కింగ్ ప్రాంతాల్లో కెమెరాలు, సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సత్యసాయి శత జయత్యుత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించడం సంతోషదాయకమన్నారు. అనంతరం సత్యసాయి శత జయంత్యుత్సవాలకు చేపట్టిన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. సమీక్ష అనంతరం అజయ్ జైన్, కలెక్టర్, ఎస్పీలతో కలసి సత్యసాయి ఎయిర్ పోర్ట్, వెస్ట్‌గేట్ రోడ్డు, ఎన్‌హెచ్–342, చిత్రావతి హారతి ఘాట్, సత్యసాయి హిల్‌వ్యూ స్టేడియం తదితర ప్రాంతాలను పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయసారథి, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ బృందం, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సత్యసాయి జయంతి వేడుకలను
వైభవంగా నిర్వహిద్దాం
అక్టోబర్ 15 నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలి
దేశ విదేశాల నుంచి వచ్చే ప్రముఖులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్
కలెక్టరేట్‌లో సత్యసాయి శత జయంత్యుత్సవాల ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష