
ఖాద్రీశుడి ఆర్జిత కల్యాణం.. భక్తులకు అవకాశం
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణం చేయించాలనుకునే భక్తులకు ఆలయ పాలక మండలి అవకాశం కల్పిస్తోంది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని దాదాపు 17 రోజుల పాటు నిర్వహించే ఆర్జీత కల్యాణోత్సవాలను భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఆసక్తి కలిగిన భక్తులు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని ఆలయ ఈఓ వెండి దండి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రావణమాసం శుక్ల పాఢ్యమి (ఈనెల 25వ తేదీ) నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు కల్యాణోత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. కల్యాణం నిర్వహించే తేదీల్లో రోజుకు 5 టికెట్లు మాత్రమే జారీ చేస్తామన్నారు. ఒక్కో టిక్కెట్ ధర రూ.6,500 ఉంటుందని, ఒక టిక్కెట్‌పై ఐదుగురికి మాత్రమే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 25, 27, 30, 31 తేదీల్లో, ఆగస్టు 3, 4, 5, 10, 11, 12, 13, 18, 19, 20, 21, 24, 25 తేదీల్లో మాత్రమే శ్రీవారి కల్యాణోత్సవాలు ఉంటాయన్నారు. ఆయా రోజుల్లో ఉదయం 10.30 గంటల నుంచి శ్రీస్వామి వారి ఆర్జీత కల్యాణోత్సవం ప్రారంభమవుతుందని ఈఓ పేర్కొన్నారు.
ఏడు మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో జిల్లాలో మూడో రోజు మంగళవారం కూడా జల్లులు కురిశాయి. ఇక సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ 7 మండలాల పరిధిలో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తాడిమర్రి మండలంలో 10.2 మి.మీ, ధర్మవరం 5.2, బత్తలపల్లి 2.4, ముదిగుబ్బ 2.2, ఎన్‌పీ కుంట 2.0, తలుపుల 1.6, కదిరి మండలంలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. ఖరీఫ్ పంటలు సాగు చేసిన రైతులు కొన్ని రోజులుగా వానదేవుడికి మొరపెట్టుకుంటున్నారు. మూడు రోజులుగా ఆకాశం మేఘావృతమవుతున్నా... తుంపర్లతోనే సరిపెడుతుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఖరీఫ్ సీజన్‌లో సరైన వర్షం లేక రైతులు లక్షలాది ఎకరాల్లో ఇంకా విత్తనం వేయలేదు. ఇక అరకొర సాగు చేసిన పంటకు నెలన్నర నుంచి నీరులేక పోవడంతో ఇబ్బంది కరంగా మారిందని రైతులు వాపోతున్నారు.
జిల్లాకు చేరుకున్న
కృష్ణా జలాలు
వజ్రకరూరు/ఉరవకొండ: కృష్ణా జలాలు అనంతపురం జిల్లాలోకి ప్రవేశించాయి. ఈ నెల 17న కర్నూలు జిల్లా మాల్యాల వద్ద శ్రీశైలం జలాశయం బ్యాక్‌వాటర్ నుంచి కృష్ణా జలాలను సీఎం చంద్రబాబు విడుదల చేయగా.. అధికారులు హంద్రీ–నీవా కాలువకు నీటి పంపింగ్‌కు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం కర్నూలు జిల్లాను దాటుకుని జిల్లాలోని వజ్రకరూరు మండలం ఛాయపురం వద్ద 134 కిలోమీటరు వద్దకు చేరుకున్నాయి. హంద్రీ–నీవా చీఫ్ ఇంజినీర్ నాగరాజు, ఇతర అధికారులు, గ్రామస్తులతో కలిసి జలహారతి ఇచ్చారు. రాగులపాడు లిఫ్ట్ వద్ద నీటిని పంపింగ్ చేసి జీడిపల్లి రిజర్వాయర్‌కు పంపనున్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ రాజాస్వరూప్, ఈఈ శ్రీనివాస్‌నాయక్, డీఈఈ రమణ, ఏఈ సురేష్‌నాయక్, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.
గురుకులాల్లో
అందుబాటులో ఇంటర్ సీట్లు
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని ఉరవకొండ, బ్రహ్మసముద్రం, నల్లమాడలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో ఇంటర్ హెచ్‌ఈసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో మొదటి సంవత్సరం (బాలికలకు మాత్రమే) ప్రవేశాలకు సీట్లు అందుబాటులో ఉన్నాయని గురుకుల పాఠశాలల ఉమ్మడి జిల్లా సమన్వయ అధికారి కె.జయలక్ష్మీ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినులు మాత్రమే అర్హులన్నారు. ఆసక్తిగల విద్యార్థినులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని కోరారు.

ఖాద్రీశుడి ఆర్జిత కల్యాణం.. భక్తులకు అవకాశం