
జిల్లా అంతటా వర్షం
● 300.6 మి.మీ వర్షపాతం నమోదు
పుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో జిల్లాలో వరుసగా రెండో రోజూ వర్షాలు కురిశాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ 300.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అమరాపురం మండలంలో 40.8 మి.మీ, కదిరిలో 40 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక నల్లమాడ మండలంలో 36.8 మి.మీ, గుడిబండ 27.8, మడకశిర 25.2, నల్లచెరువు 15.8, ధర్మవరం 13.4, కనగానపల్లి 10.2, ఎన్‌పీకుంట 9.0, బుక్కపట్నం 7.6, తలుపుల 7.4, హిందూపురం 6.8, ముదిగుబ్బ 6.4, రొళ్ల 6.4, ఓడీచెరువు 6.4, గాండ్లపెంట 6.2, తనకల్లు 6.0, అగళి 5.2, కొత్తచెరువు 4.2, పుట్టపర్తి 3.8, లేపాక్షి 3.4, రొద్దం 2.2, చిలమత్తూరు 2.2, రామగిరి 2.0, పరిగి 2.0, బత్తలపల్లి మండలంలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. కాగా, మరో రెండురోజులూ జిల్లాలో అక్కడక్కడా జల్లులు నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
పరిష్కార వేదికకు
260 వినతులు
ప్రశాంతి నిలయం: ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ సమస్యలపై 260 వినతులు అందాయి. కలెక్టర్ చేతన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని ఆయాశాఖలకు పంపారు. అనంతరం ఆయన అధికారులతో సమావేశమై అర్జీల పరిష్కారంపై దిశానిర్దేశం చేశారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలన్నారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల్లో తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో కల్పించిన సౌకర్యాలను తెలుపుతూ సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్‌ఓ విజయ సారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సూర్యనారాయణరెడ్డి, రామసుబ్బయ్య, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.
రీసర్వే త్వరితగతిన
పూర్తి చేయండి: జేసీ
ప్రశాంతి నిలయం: జిల్లాలోని 32 గ్రామాల్లో చేపట్టిన రీ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదేశించారు. నెలాఖరులోగా డీఎల్‌ఆర్ పూర్తి చేయాలన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ అంశాలతో పాటు రీసర్వేపై సమీక్షించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా అర్జీదారులతో స్వయంగా మాట్లాడి సమస్యను తెలుసుకొని పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, సర్వే, ల్యాండ్ ఏడీ విజయశాంతి బాయి తదితరులు పాల్గొన్నారు.
వసతి గృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ప్రశాంతి నిలయం: విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వసతి గృహాల్లో (2025–26 విద్యా సంవత్సరానికి) ప్రవేశాలకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ సహాయ సంచాలకులు అర్చన సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. 3వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు దరఖాస్తుకు అర్హులన్నారు. బాలురకు అనంతపురంలోని హెచ్‌ఎల్‌సీ కాలనీలో, బాలికలకు అనంతపురం అరవింద నగర్‌లో వసతి గృహాలు ఏర్పాటు చేశామన్నారు. వసతి గ్రహంలో చేరే వారికి ఉచిత భోజన, వసతితో పాటు దుస్తులు, నోటు పుస్తకాలు, ట్రంక్ పెట్టె, ప్లేట్లు, గ్లాసులు, కాస్మోటిక్స్ అందిస్తామన్నారు.

జిల్లా అంతటా వర్షం

జిల్లా అంతటా వర్షం