
నిందలు.. నిష్టూరాలు
మడకశిర: హోం మంత్రి వంగలపూడి అనిత ‘తొలి అడుగు’ కార్యక్రమం నిందలు.. నిష్టూరాలతో సాగింది. సోమవారం ఆమె మడకశిర నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఎక్కడికి వెళ్లినా...ఏ కార్యక్రమంలో పాల్గొన్నా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రె డ్డి, ఆ పార్టీ నేతలను విమర్శించడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోవడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపినా... ఒక్కరంటే ఒక్కరి సమస్య కూడా వినలేదు. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో ప్రజలకు ఏం చేసిందో చెప్పేందుకు పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్‌లో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అధ్యక్షతన జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు సభలో మాట్లాడిన హోంమంత్రి అనిత... ఏడాది పాలనలో ఏం చేసారో చెప్పడం పక్కన పెట్టి.. వైఎస్సార్‌సీపీ పాలనపై నిందలు వేస్తూ నిష్టూరమాడారు. దీంతో ప్రజలు విస్మయం చెందారు. ఏడాది పాలనలో కూటమి సర్కార్ మడకశిరకు ఏం చేయలేకపోయిందని, అందుకే చెప్పేందుకు ఏం లేక హోంమంత్రి ఇలా విమర్శలతో డైవర్షన్ పాలిటిక్స్ చేశారని జనం చర్చించుకున్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా జగన్‌పై విమర్శలు చేస్తే ఏం లాభమని వ్యాఖ్యానించారు. మహిళల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పడంతో సభలో ఉన్న వారు ఏడుగుర్రాలపల్లిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనను గుర్తు చేసుకుని ఇదేనా మహిళా సంక్షేమం అంటూ చర్చించుకున్నారు. మరో మంత్రి సవిత కూడా మడకశిర ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తి మడకశిర అభివృద్ధి గురించి మాట్లాడకుండా వెళ్లి పోవడంతో స్థానికులు అసహనానికి లోనయ్యారు. అంతకుముందు హోంమంత్రి అనిత బీసీ సంక్షేమశాఖ మంత్రి సవితతో కలిసి ఇండియన్ డిజైన్స్ గార్మెంట్స్ పరిశ్రమను సందర్శించారు. అన్న క్యాంటీన్‌ను పరిశీలించారు. మడకశిర అప్‌గ్రేడ్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. కాగా, హోంమంత్రి అనిత పర్యటనలో జిల్లాలోని మిగతా నియోజకవర్గాల కూటమి ఎమ్మెల్యేలు పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎంపీ పార్థసారథి కూడా పార్లమెంట్ సమావేశాల పేరుతో గైర్హాజరు కావడం విశేషం.
‘తొలి అడుగు’లో హోంమంత్రి అనిత తీరిది
ఆద్యంతం వైఎస్సార్‌సీపీపై
విమర్శలకే ప్రాధాన్యం
ఏడాది పాలనలో ప్రజలకు ఏం చేశారో
చెప్పుకోలేని వైనం