
కూటమి ప్రభుత్వ తీరు దుర్మార్గం
● వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప
గుడిబండ: ప్రతిపక్ష పార్టీల నాయకులను అక్రమంగా అరెస్టు చేయించి వారి గొంతునొక్కేందుకు ప్రయత్నిస్తున్న కూటమి ప్రభుత్వ తీరు దుర్మార్గంగా ఉందని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప మండిపడ్డారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సోమవారం మడకశిర నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఈరలక్కప్పను హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. 14 నెలల పాలనలో కూటమి సర్కార్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఓ దళిత మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే రాష్ట్రం యావత్తూ కన్నీరుపెట్టుకుందన్నారు. కానీ ఆ మాత్రం జాలి కూడా కూటమి నేతలకు లేకపోయిందన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన హోంమంత్రి జిల్లా పర్యటనకు వచ్చినా.. బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు ఆపాలని కోరుతూ డిమాండ్‌లతో కూడిన వినతి పత్రం ఇద్దామని మడకశిరకు బయలు దేరిన తనను పోలీసులు గృహ నిర్భంధం చేయడం సిగ్గుచేటన్నారు. కూటమి నాయకుల కుట్రలు, కుతంత్రాలు మానుకోవాలని, లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అక్రమ అరెస్టులతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను భయపెట్టలేరన్నారు. వైఎస్సార్ సీపీ ఎప్పుడూ ప్రజల పక్షమేనని, ప్రజలకోసం ఎంతకై నా పోరాడుతుందన్నారు.