
హోం మంత్రికి దళితుల పట్ల బాధ్యత లేదా?
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీ చరణ్
సాక్షి పుట్టపర్తి: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితకు దళితుల పట్ల బాధ్యత లేదా అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్ ప్రశ్నించారు. సోమవారం మడకశిర నియోజక వర్గంలో పర్యటించిన హోంమంత్రి అనిత రాప్తాడు నియోజకవర్గంలో అత్యాచారానికి గురై బిడ్డకు జన్మనిచ్చి దిక్కుతోచని స్థితిలో ఉన్న దళిత మైనర్ బాలికను పరామర్శించక పోవడం బాధాకరమన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన హోం మంత్రి అనితకు దళిత మహిళల కష్టాలు పట్టవా అని ప్రశ్నించారు. కూటమి నేతలు వైఎస్సార్ సీపీ నాయకుల అక్రమ అరెస్టులపై చూపించే శ్రద్ధ, ప్రజా సమస్యల పరిష్కారంపై చూపడం లేదన్నారు. హోంమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లాలోని పలువురు వైఎస్సార్ సీపీ నాయకులను హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన సాగుతోందనేందుకు ఈ అక్రమ అరెస్టులే నిదర్శనమన్నారు. కూటమి సర్కార్ నిరంకుశ పాలనను ప్రజలంతా గమనిస్తున్నారని, సరైన సమయంలో సరైన విధంగా సమాధానం చెబుతారన్నారు.