
బదిలీ టీచర్లకు వేతన కష్టాలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,200 మంది ఉపాధ్యాయుల్లో పదోన్నతి దక్కిన ఆనందం ఆవిరైపోయింది. బదిలీపై కొత్త ప్రాంతానికి వెళ్లిన వారు జీతాలు అందక నానా అగచాట్లు పడుతున్నారు. కీలకమైన జూన్ మాసంలో పిల్లల ఫీజులు, బ్యాంకు లోన్లు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. మరో పది రోజుల్లో జూలై మాసం కూడా ముగియనున్న తరుణంలో రెండు నెలల జీతాలు ఆగస్టులో ప్రభుత్వం చెల్లిస్తుందో.. లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అనంతపురం ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘ఉపాధ్యాయ బదిలీ చట్టం’ ద్వారా ఇటీవల పలువురు టీచర్లకు పదోన్నతులు, బదిలీలు జరిగాయి. వీరిలో వేలాది మందికి పొజిషన్ ఐడీలు రాక జూన్ నెల జీతం ఇప్పటి వరకూ అందలేదు. మరో వారం గడిస్తే రెన్నెళ్ల జీతం అందాల్సి ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 7,152 మంది టీచర్లు బదిలీ అయ్యారు. వీరిలో గ్రేడ్–2 హెచ్‌ఎంలు 133 మంది, పీఎస్‌హెచ్‌ఎంలు 193 మంది, స్కూల్ అసిస్టెంట్లు 3,478 మంది, ఎస్జీటీలు 3,208 మంది, పండిట్లు 111 మంది, పీఈటీలు 29 మంది ఉన్నారు. సాధారణంగా ఉపాధ్యాయ, ఉద్యోగులకు వారు బదిలీ అయిన ప్రాంతాల్లో జీతాలు తీసుకునేలా అక్కడి డీడీఓలకు సమాచారం అందిస్తారు. గతంలో రెగ్యులర్ జీతాలు తీసుకుంటున్నా...వీరి స్థానం మారడంతో బదిలీ అయిన స్థానానికి పొజిషన్ ఐడీ కేటాయించాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే సీఎఫ్‌ఎంఎస్‌లో వారి వివరాలు కనిపిస్తాయి. అప్పుడు జీతాలు చెల్లించడానికి వీలుంటుందని ఉద్యోగ, ఉపాధ్యాయులు చెబుతున్నారు.
జీతాల కోసం ఎదురు చూస్తున్న
5 రకాల పాఠశాలల టీచర్లు..
కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పది రకాల పాఠశాలల్లో 5 రకాల పాఠశాలల ఉపాధ్యాయులు జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కేడర్ల టీచర్లు దాదాపు 2,200 మందికి జూన్ నెల వేతనాలు జమకాలేదు. అప్‌గ్రేడ్ అయిన ప్రాథమికోన్నత పాఠశాలలు, కొత్తగా ఏర్పాటైన మోడల్ ప్రైమరీ పాఠశాలలు, కొత్తగా పదోన్నతులు పొందిన స్కూల్ అసిస్టెంట్లు, గ్రేడ్–2 హెచ్‌ఎంలకు జీతాలు రాలేదు. వీరందరికీ పొజిషన్ ఐడీలు కేటాయించాల్సి ఉంది. ముఖ్యంగా మోడల్ ప్రైమరీ పాఠశాలలకు పలువురు స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలను కేటాయించారు. వాస్తవానికి ఆ పాఠశాలల్లో గతంలో కేడర్ స్ట్రెంత్‌కు అనుగుణంగా ఉన్న పోస్టులకు జీతాలు చేసే వీలుంటుంది. కొత్తగా వచ్చిన పోస్టులకు పొజిషన్ ఐడీలు కేటాయించిన తర్వాతనే జీతాలకు అవకాశం ఉంటుంది. అప్‌గ్రేడ్ అయిన యూపీ స్కూళ్ల టీచర్లకు ఇదే ప్రధాన సమస్యగా మారింది. ఇక్కడ డీడీఓ మారడంతో ఏ ఒక్కరికీ జీతభత్యాలు అందలేదు. పొజిషన్ ఐడీలు మండల స్థాయిలో నిర్ధారించి, జిల్లాకు.. ఇక్కడి నిర్ధారించి రాష్ట్రానికి పంపాల్సింది పోయి, నేరుగా రాష్ట్ర స్థాయిలో కేటాయించే చర్యలు చేపట్టడంతో సమస్య ఉత్పన్నమవుతోందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు వాపోతున్నారు. రాష్ట్రస్థాయిలో స్పష్టత రాక తిరిగి జిల్లా నుంచి 8 నుంచి 10 మంది సాంకేతిక నిపుణులను పిలిపించి వారం రోజులకు పైగా సరి చేయాల్సి వచ్చింది.
పిల్లల ఫీజులు,
బ్యాంకులోన్ల కంతులకు అగచాట్లు..
కీలకమైన జూన్ నెలకు సంబంధించిన వేతనాలు రాకపోయేసరికి చాలామంది టీచర్లు పిల్లల చదువులకు ఫీజులు, బ్యాంకు లోన్ల కంతులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేయాల్సి వస్తోందంటూ వాపోతున్నారు. వారం రోజులు గడిస్తే జూలై జీతం రావాల్సి ఉందని, రెన్నెళ్ల జీతమైనా ఆగస్టులో వచ్చేలా అధికారులు చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పదోన్నతులు, బదిలీల టీచర్లకు
పొజిషన్ ఐడీలు రాక అందని జీతాలు
ఇబ్బందుల్లో ఉమ్మడి జిలాలోని
2,200 మంది ఉపాధ్యాయులు
పిల్లల ఫీజులు, బ్యాంకు లోన్ల
కంతులకు అగచాట్లు

బదిలీ టీచర్లకు వేతన కష్టాలు